రేవంత్‌ ఎటాక్‌: కేసీఆర్‌ ముందున్న టార్గెట్‌ ఇదే?

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాజకీయంతో మాజీ సీఎం కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒక్క ఓటమితో ఆయన తన పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. పార్టీ నుంచి మహా మహులు అనుకున్న వాళ్లే వెళ్లిపోతున్నారు. కడియం, కేకే వంటి దిగ్గజాలు కూడా టాటా చెప్పేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు పార్టీ నుంచి వలసలు ఆపడమే కేసీఆర్‌ ముందున్న అసలు టార్గెట్‌గా కనిపిస్తోంది. కీలక నేతల వలసలతో సీఎం కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే నేతలంతా వలస బాట పడుతున్నారు.

సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు... ఇలా ఒకరేంటి.. పార్టీలోని నేతలంతా జంపింగ్‌ మూడ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టేశారు. ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలన్నీ భారత రాష్ట్ర సమితి అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారాయి. అయితే.. ఈ పరిస్థితుల్లో వలసల గురించి ఆందోళన చెంది.. గులాబీ శ్రేణుల ధైర్యం దెబ్బతీయరాదని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఉద్యమ ప్రస్థానంలో ఎంతోమంది నేతలు పార్టీలోకి వచ్చారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగిందని కేసీఆర్‌ నేతలతో చెబుతున్నారట. కొందరు నేతలు వెళ్లినంత మాత్రాన... ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గదని... శ్రేణులను కాపాడుకుంటే ఇబ్బందులు ఉండబోవని కేసీఆర్‌ భావిస్తున్నారట. అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు... ఇప్పుడు వారి అవసరాలు, రాజకీయ స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారు.

అలాంటి నేతలు పోయినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగబోదంటున్న కేసీఆర్‌ .. కష్టపడితే మళ్లీ పుంజుకోవచ్చు అని చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీతో ఉన్నవారికి, నమ్మకంగా ఉన్నవారికి తగిన గౌరవం ఇస్తామంటున్నారు. అంతే కాదు.. అవకాశం ఉన్నచోట కొత్త నాయకత్వాన్ని తయారు చేసేలా  కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్‌  భావిస్తున్నారు. నేతలు వలస వెళ్లినప్పటికీ విస్తృతంగా ప్రజల్లో ఉండడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చంటున్నారు కేసీఆర్‌. మరి అలా చేయడంలో ఆయన ఎంతగా సక్సస్‌ అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: