ఏపీ: పెన్షన్ పంపిణిలపై కీలక మార్పులు వెల్లడించిన మంత్రి .!

FARMANULLA SHAIK
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కేటగిరీల పెన్షన్లు పెంచి అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతీ ఇంటికి ఒకటో తేదీనే అందేలా అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు సహా, మంత్రు లు..ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకటో తేదీ సెలవు ఉంటే ముందు రోజునే పెన్షన్ల పంపిణీ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తోంది.ఇదేక్రమంలోఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికామని అన్నారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చామని తెలిపారు. దీన్నే స్పౌజ్‌ క్యాటగిరీగా గుర్తిస్తూ పింఛను మంజూరు చేస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్‌ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారని, ఈ నెల నుంచి పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు. నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు కొత్తగా 5,402 మందికి వితంతువు ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి క్యాటగిరీలో పింఛను మంజూరు చేశామన్నారు. వీరికి డిసెంబర్‌ 31వ తేదీన రూ.4 వేల చొప్పున పింఛను పంపిణీ చేయనున్నామని తెలిపారు. అలాగే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛను తీసుకోని 50 వేల మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నామని ఆయన అన్నారు. వీరికి రెండు, మూడు నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ప్రకటనలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: