అన్న సీటుకు ఎసరు పెడుతున్న చెల్లెలు.. ?
కాంగ్రెస్ అధినేతగా రాహుల్ విఫలమైన నేపథ్యంలో ఆయన స్థానాన్ని ఆయన చెల్లెలు ప్రియాంకా గాంధీ ఆక్రమిస్తారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.తాజాగా యూపీలోని సోన్‌భద్ర బాధిత కుటుంబాలను కలవడంలో ప్రియాంక గాంధీ చూపించిన చొరవ ఆమెను కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి దగ్గర చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబీకుల చేతుల్లోనే ఉండాలని కోరే వారికి ప్రియాంక ఆశాదీపంలా కనిపిస్తున్నారు.
సోన్‌భద్ర బాధితులను పరామర్శించడానికి ప్రియాంకగాంధీ ఇటీవల యూపీ వెళ్ళారు.. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెను బాధితుల ప్రాంతానికి అనుమతి ఇవ్వలేదు... దీంతో ప్రియాంక గాంధీ రోడ్డుపై బైటాయించారు. యూపి ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.ప్రియాంక గాంధీని అక్కడ గెస్ట్ హౌస్‌కు తరలించారు.
అయినా పట్టు వీడని ప్రియాంక గాంధీ అక్కడే నిరసన తెలియజేయడంతో .. దిగివచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధితులను ప్రియాంక గాంధీ వద్దకు తీసుకుని వచ్చారు. బాధితులను ఓదార్చిన తరువాత మాత్రమే ప్రియాంక గాంధీ అక్కడి నుండి తిరిగి వెళ్ళారు.
ప్రియాంక గాంధీ పట్టువీడకుండా అనుకున్నది సాధించిందనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.. కాంగ్రెస్‌కు భావి నాయకురాలు దొరికినట్టే కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ అద్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలని కొందరు సీనియర్లు అప్పుడే డిమాండ్ ప్రారంబించారు. ప్రియాంక అయితేనే పార్టీ ఐక్యంగా ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కామెంట్ చేయడం విశేషం.