దుర్గా: భక్తులే పూజారులు.. విశాఖ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయం ప్రత్యేకతలు.. తెలుసుకుని తీరాల్సిందే.?
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు. మరి ఈ ఆలయ చరిత్ర .మహిమలు.. విశేషాలేంటో.. తెలుసుకుందాం..శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాలలో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది. విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభు: .ఆశ్చర్యకరంగా ఇక్కడ అమ్మవారికి ఎడమచెయ్యి సగం వరకే ఉంది. మరో విషయం ఏమటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమి ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరాలు ఏర్పాటు చేస్తారు . ఇక్కడ భక్తులే స్వయం గా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమా చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజారులు ఎవరు ఉండరు, భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి భయటకు వస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారే ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో విశేషం.