ఏపీ: అభ్యర్ధికి రెండోసారి చాన్స్ ఇవ్వని నియోజకవర్గం ఎక్కడుందో తెలుసా?

Suma Kallamadi
1978లో ఏర్పాటైన ఆ నియోజకవర్గం ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో అక్కడ కొత్త ముఖాన్నే ఓటర్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని మీలో ఎంతమందికి తెలుసు? అవును, అక్కడ ఒకసారి గెలిచిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. అదే పెందుర్తి. ఇటు విశాఖపట్నం, అటు అనకాపల్లి జిల్లాలలో విస్తరించివున్న ఉన్న ఈ నియోజకవర్గం ప్రత్యేకత అదే. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,581 కాగా గ్రామీణ, పట్టణ ప్రాంత ఓటర్ల కలయితో మిళితమై ఉండే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు మిగతా నియోజకవర్గాల కంటే భిన్నంగానే ఉంది. అవును, పెందుర్తి నుంచి ఎవరు పోటీ చేసినా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండోసారి ఏ పార్టీలో నుంచి రంగంలోకి దిగినా ఓటమే ఎదురయ్యేది వారికి.
అయితే కొన్ని దశాబ్ధాలుగా వస్తున్న ఈ ఆనవాయితీ ఈ 2024 ఎన్నికల్లో బ్రేక్ పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే? ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల్లో రంగంలోకి దిగిన వైకాపా, జనసేన అభ్యర్థులు ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు కావడం విశేషం. ప్రధాన పార్టీలు కావడంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుపొందే అవకాశం అయితే పక్కా. ఇక ఈ రెండు పార్టీలు కాకుండా బరిలో ఉన్న కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్లు అభ్యర్థులు గెలుపొందే అవకాశం లేదు. కాబట్టి ఈసారి 'ఒక్కసారే ఛాన్స్' అనవాయితీ రికార్డ్ బ్రేక్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి.
పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ బరిలో ఉండగా కూటమి అభ్యర్థిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు జనసేన నుంచి పోటీలో ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉన్నాయి. ఇందులో పెదగంట్యాడ, పెందుర్తి నగరాన్ని తలపిస్తే... పరవాడ, సబ్బవరం మండలాలు పూర్తి గ్రామీణ వాతావరణంతో ఉంటాయి. విశాఖ నగరంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో, నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న పెందుర్తిలో రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న పరవాడ ఫార్మా సిటీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: