ఏపీ: 25 వేల ఓట్ల తేడాతో కుప్పంలో బాబు ఓడిపోనున్నారా?

Suma Kallamadi
ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మే 13వ తేదీ సమీపిస్తోండటంతో ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమిలు ఉధృతంగా ప్రచార కార్యక్రమాలను షురూ చేసాయి. ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారే అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇక్కడి రిజల్ట్ ఎలా ఉండొచ్చనే విషయం అత్యంత కీలకంగా మారింది.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కావడమే దీనికి కారణం అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా ఆయన కుప్పం నుంచే బరిలోకి దిగడం గమనార్హం. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేస్తోండటం ఎనిమిదో సారి. 7 సార్లు అక్కడ వరుసగా ఆయన విజయం సాధించారు. అంటే 1989 నుంచీ గెలుస్తూనే వస్తోన్నారు. అయితే ఈ దఫా మాత్రం పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేకపోవచ్చంటూ గతంలోనే వార్తలొస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలపడిందనడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడమే దీనికి నిదర్శనం.
2019 నాటి ఎన్నికల్లో చంద్రబాబు తొలి 2 రౌండ్లల్లో వెనుకంజలో పడ్డ సంగతి తెలిసిందే. ఇక్కడ పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను చిత్తూరు జిల్లాకే చెందిన సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్న సంగతి విదితమే. కాగా చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుడు, శాసన మండలి సభ్యుడు కేఆర్‌జే భరత్ పోటీలో నిలిచారు. ఈ పరిస్థితుల్లో కుప్పం ఫలితం ఎలా ఉండొచ్చనే అంశంపై ఓ జ్యోతిష్యుడు తన అంచనాలను తాజాగా ఓ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతారనేది కూడా చెప్పడం ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది. 25,630 ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోతారని అన్నారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: