రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సినిమాలో తిరిగినట్లు ట్విస్టులు తిరుగుతోంది. తన నియామకంపై నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి మాట్లాడుకోవాలని చెప్పటమే అసలైన లేటెస్టు ట్విస్టు. తన కాలపరిమితి కాకుండానే ఆర్డినెన్సు ద్వారా తనను తొలగించటంపై నిమ్మగడ్డ హైకోర్టులో ముందు కేసు వేశాడు. కేసు విచారించిన హైకోర్టు ఇటు నిమ్మగడ్డకు అటు రాష్ట్రప్రభుత్వానికి అర్ధంకాని రీతిలో తీర్పిచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లదని చెబుతునే అసలు ఎన్నికల కమీషనర్ ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీర్పివ్వటంతో అందరిలోను అయోమయం నెలకొంది. ఆర్డినెన్సు చెల్లదని చెప్పటం వరకు నిమ్మగడ్డకు అనుకూలంగానే తీర్పుంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నియమించే అవకాశం రాష్ట్రప్రభుత్వానికి లేదని చెప్పటంతోనే గందరగోళం మొదలైంది.
తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిస్తే ఏమవుతుంది ? అసలు నిమ్మగడ్డ గవర్నర్ ను ఎందుకు కలవాలి ? ఎందుకంటే రాష్ట్రప్రభుత్వం తయారుచేసిన ఆర్డినెన్సు మీద సంతకం పెట్టిందే గవర్నర్ కాబట్టి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కాలపరిమితిని ఐదేళ్ళ నుండి మూడేళ్ళకు తగ్గిస్తు ప్రభుత్వం ఆర్డినెన్సు రెడీ చేసింది. దానిమీద గవర్నర్ సంతకం చేయటంతో చట్ట రూపం వచ్చింది. దాంతో నిమ్మగడ్డ కాలపరిమితి అయిపోవటంతో కమీషనర్ గా తప్పుకోవాల్సొచ్చింది. తనను కమీషనర్ గా తొలగించేందుకే ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసిందని నిమ్మగడ్డ హైకోర్టులో కేసు వేశాడు. చివరకు ఇపుడా కేసు సుప్రింకోర్టు విచారణలో ఉంది.
ఇంతలోనే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేసినా స్టే రాలేదు కాబట్టి తనను వెంటనే కమీషనర్ గా నియమించాలని కోరుతూ నిమ్మగడ్డ కంటెంప్ట్ పిటీషన్ దాఖలు చేశాడు. దానిపై స్పందించిన హైకోర్టు తన నియామకంపై గవర్నర్ ను కలవాలని ఆదేశించింది. సరే ఇంతవరకూ బాగానే ఉంది. గవర్నర్ ను నిమ్మగడ్డ కలిస్తే ఏమవుతుంది ? వెంటనే నిమ్మగడ్డను కమీషనర్ గా నియమిస్తు గవర్నర్ ఉత్తర్వులైతే ఇవ్వలేరు కదా ? ఎందుకంటే గవర్నర్ సంతకం పెట్టిన ఆర్డినెన్సు ఆధారంగానే నిమ్మగడ్డ మాజీ అయిపోయాడు. మరపుడు ఆర్డినెన్సుపై సంతకం పెట్టిన గవర్నర్ మళ్ళీ ఇపుడు ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా సంతకం పెడతారా ? ఒకవేళ ఇపుడు సంతకం పెడితే ఆర్డినెన్సుపై చేసిన సంతకం తప్పని తానే అంగీకరించినట్లవుతుంది.
ఒకవేళ గవర్నర్ సంతకం చేయకపోతే అపుడేమవుతుంది ? ఏమీకాదు. ఎందుకంటే గవర్నర్ ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదు. ఎలాగూ నిమ్మగడ్డ కేసు సుప్రింకోర్టులో ఉంది కాబట్టి అది తేలేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ గవర్నర్ సంతకం చేయాలన్నా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించకుండా సంతకం అయితే చేయరు. అదే సమయంలో నిమ్మగడ్డ నియామకానికి రాష్ట్రప్రభుత్వం ఎలాగూ అంగీకరించదు. మరి నిమ్మగడ్డ గవర్నర్ ను కలవటం వల్ల ఉపయోగం ఏమిటి ? అంటే ఏమీ ఉండదనే అనుకోవాలి. ఏదో గవర్నర్ ను కలిసి నమస్కారం పెట్టి తన బాధను చెప్పుకుని బయటకు రావాల్సిందే. స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తు నిమ్మగడ్డ ఏకపక్షంగా చేసిన ఓవర్ యాక్షన్ ప్రకటనే ఇంత కంపుకు కారణమైంది. దాని కారణంగా హైకోర్టుకు-గవర్నర్-సుప్రింకోర్టు మధ్య నిమ్మగడ్డ ఫుట్ బాల్ లాగ తిరుగుతున్నాడు. ఇంకెన్నిసార్లు తిరుగుతాడో ఏమో చూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: