ఎడిటోరియల్ : ఇందుకే జగన్ ‘ సిట్ ‘ విచారణను వ్యతిరేకించారా ?

Vijaya

తనపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై సిట్ విచారణను జగన్ వ్యతిరేకించటానికి కారణాలు ఇప్పుడు స్పష్టమవుతున్నాయి. ఘటన జరిగి ఇప్పటికి ఎనిమిది రోజులైనా విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. పైగా దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ విచారణకు సహకరించటం లేదని, ఒక్క మాట కూడా చెప్పటం లేదని స్వయంగా సిట్ విచారణకు నేతృత్వం వహిస్తున్న మహేష్ చంద్ర లడ్డా రెండు సార్లు చెప్పటం విచిత్రంగా ఉంది.  

 

దాడి జరిగిన మధ్యాహ్నమే డిజిపి ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై హత్యాయత్నానం చేసింది జగన్ అభిమానే అంటూ తేల్చేశారు. ప్రచారం కోసమే దాడి చేసినట్లు నిర్దారించారు. జగన్ కు సానుభూతి రావాలన్న ఉద్దేశ్యంతోనే తాను దాడి చేసినట్లు నిందితుడు చెప్పాడంటూ ప్రకటించేశారు. సాయంత్రానికి ఘటనపై విచారణకు సిట్ నియమింనట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే, అప్పుడు కూడా మధ్యాహ్నం డిజిపి ఏం చెప్పారో అవే మాటలను చిలకపలుకుల్లాగ రిపీట్ చేశాడు నిందితుడు. అంటే పోలీసు బాస్ చెప్పిన మాటలనే తిరిగి శ్రీనివాస్ అప్పచెప్పినట్లు అర్ధమైపోయింది.

 

అప్పటి నుండి ఎనిమిది రోజులవుతున్నా అదనంగా నిందితుడు ఒక్కమాట కూడా చెప్పలేదని లడ్డా చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా శ్రీనివాస్ విచారణలో ఏమి చెప్పాడో,  చెప్పలేదో తెలీదు.  కానీ నిందితుడు మాత్రం నోరిప్పలేదని లడ్డా ఇప్పటికి రెండుసార్లు మీడియా ముందు ప్రకటించారు. అదే సమయంలో విచారణలో భాగంగా తనను కలసిన సిట్ అధికారులతో మాట్లాడటానికి జగన్ ఇష్టపడలేదు. తాము సిట్ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు వైసిపి నేతలు మొదటి నుండి చెబుతునే ఉన్నారు.


హత్యాయత్నం వెనకున్న కుట్ర బహిర్గతం కావాలంటే థార్డ్ పార్టీ విచారణ జరపాల్సిందేనంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు. అదే డిమాండ్ తో హైకోర్టులో కేసు కూడా వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జగన్, వైసిపి నేతలేమో హత్యాయత్నం కుట్ర జరిగిందంటున్నారు. ప్రభుత్వమేమో సింపుల్ గా దాడి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే సిట్ విచారణ కూడా జరుగుతున్నట్లు అర్ధమైపోతోంది.


ఎంతసేపు విచారణను నిందితుడు వాడిని మొబైల్ ఫోన్లు, వాడిన సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఎవరెవరితో మాట్లాడారు ? ఎన్ని ఫోన్ కాల్స్ చేశాడు ? అన్న విషయాల చుట్టూనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నట్లు కనబడుతోంది. అంటే హత్యాయత్నంలో కుట్ర కోణం దిశగా సిట్ విచారణ జరుగుతున్నట్లు కనబడటం లేదు. ఇదే దాడి టిడిపిలో ఎవరైనా కీలక నేతపై జరుగుంటే పోలీసు విచారణ ఇలాగే జరిగేదా అన్నదే ప్రశ్న. తాను విచారణకు సహకరించినా సిట్ విచారణ ఇంతకన్నా భిన్నంగా జరిగేది కాదన్న అభిప్రాయంతోనే జగన్ సిట్ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు అర్దమైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: