కాపు రిజర్వేషన్లపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేతెలెత్తేసింది. ఈరోజు మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, కాపులను బిసిల్లోకి చేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వ పరిధిలో చేయాల్సిందంతా రాఫ్ట్రప్రభుత్వం చేసేసిందన్నారు. ఇక చేయాల్సింది కేంద్రప్రభుత్వం మాత్రమే అంటూ నిసిగ్గుగా చేతులు దులిపేసుకున్నారు.
కేంద్రంపైకి నెట్టేస్తున్న యనమల
ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతానికి మించింది కాబట్టి కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించటం సాధ్యం కాదన్నారు. ఒకవేళ కాపులను బిసిల్లో కలపాలంటే రాజ్యాంగ సవరణ తప్పదన్నారు. రాజ్యాంగ సవరణ అన్నది కేంద్రప్రభుత్వం పరిధిలోనిది కాబట్టే ఇపుడు కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సింది కేంద్రమేనట. ఇక్కడే యనమల అతితెలివి బాగా కనబడుతోంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించకూడదని సుప్రింకోర్టు చెప్పిన మాట కూడా వాస్తవమే అంటూ యనమల అంగీకరిస్తున్నారు.
రాజ్యాంగాన్ని సవరించాల్సిందే
అంటే కాపులకు కేంద్రం రిజర్వేషన్ కల్పించాలని అనుకున్నా, రాజ్యాంగ సవరణ చేసినా సుప్రింకోర్టు అయితే ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి కేంద్రం అంగీకరించినా కాపులకు రిజర్వేషన్ కల్పించటం సాధ్యం కాదని యనమల మాటల్లోనే తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సింది కేంద్రమే అని చెప్పటమంటే అతి తెలివిని ప్రదర్శించటమే. తమ చేతకాని తనాన్ని కేంద్రంపై తోసేసి టిడిపి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. బహుశా కాపులను బిసిల్లో చేర్చాలన్న అంశాన్ని చంద్రబాబు మళ్ళీ 2019లో కూడా ప్రస్తావించేట్లే ఉన్నారు చూడబోతే. రిజర్వేషన్ల అమలులో ఇన్ని సమస్యలున్నాయని తీరిగ్గా చెబుతున్న యనమల మొన్న ఇదే విషయాన్ని జగన్ చెబితే మాత్రం అంగీకరిచటం లేదు.