తెలుగు తమ్ముళ్లకు పదవుల పండగ..! కేడర్ లో ఫుల్ జోష్..!!

Vasishta

          ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కాలంగా తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్ పదవులకోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయమున్న పరిస్థితుల్లో తమకు ఆ అవకాశం దక్కుతుందో లేదోనని చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే అధ్యక్షుడు చంద్రబాబు అనూహ్యంగా 17 సంస్థలకు బాధ్యులను నియమించి కేడర్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చారు.


          టీటీడీకి చాలాకాలంగా పాలక మండలి లేదు. పాలకమండలి ఛైర్మన్ పదవికోసం పలువురు పోటీ పడ్డారు. అయితే వారందరినీ కాదని కొన్నాళ్ల క్రితమే దాదాపు కన్ఫామ్ అయిన పుట్టా సుధాకర్ యాదవ్ కే ఆ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. క్రైస్తవ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న పుట్టాకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టొద్దని పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే పుట్టా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన చంద్రబాబు ఆయనకే పదవి కట్టబెట్టారు.


          ఇక కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా చలమలశెట్టి రామానుజయ తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడికి ఆ పదవి దక్కింది. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు మధ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగొచ్చారు. అప్పటి నుంచి ఆయన పదవికోసం వెయిట్ చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ పదవి ఎవరిని వరిస్తుందోనని చాలాకాలంగా ఉత్కంఠ నెలకొంది.


          సాగునీటి అభివృద్ధి రంగ సంస్థ ఛైర్మన్ గా ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఆర్టీసీ ఛైర్మన్ గా సీనియర్ నేత వర్ల రామయ్యను నియమించారు. ఇటీవల రాజ్యసభ పదవి తృటిలో చేజారిన నేపథ్యంలో ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించారు. ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా జూపూడి ప్రభాకర్ ను కంటిన్యూ చేశారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ గా తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నామాన రాంబాబును నియమించారు. వైసీపీ నుంచి పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ కుమారుడికోసం జడ్పీ ఛైర్మన్ పదవిని రాంబాబు వదులుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఈ పదవి దక్కింది.


          కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు రాష్ట్ర అటవీ అభివృద్ధ సంస్థ ఛైర్మన్ గిరీ దక్కింది. సీనియర్ నేత లాల్ జాన్ భాషా సోదరుడు జియావుద్దీన్ ను మైనారిటీ కమిషన్ ఛైర్మన్ గా నియమించారు. ఇక మైనారిటీ ఆర్థిక సంస్థ ఛైర్మన్ గా హిదాయత్ కు మరో సారి అవకాశం దక్కింది. ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ లను కూడా చంద్రబాబు భర్తీ చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యులతో పాటు మిగిలిన కార్పొరేషన్ల ఛైర్మన్ లను కూడా రెండు మూడ్రోజుల్లో నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: