వైసీపీ, టీడీపీల చేత.. పవన్ ఆ పని చేయిస్తారా..?

Vasishta

సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే రాష్ట్రం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలూ గళమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. ఎత్తుకు పైఎత్తుల్లో ఓ అడుగు ముందేసిన వైసీపీ.. టీడీపీని ఒప్పించాల్సిందిగా పవన్ ను కోరింది. ఇందుకు అంగీకరించిన పవన్.. వైసీపీ ప్రవేశపెడ్తే మద్దతు కూడగట్టే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా అవిశ్వాసం అస్త్రాన్ని బయటకి తీశారు. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరు..?


రాష్ట్రంలో అవిశ్వాసం తీర్మానం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలోనూ అధికార, ప్రతిపక్షాలు పోటీపడుతుండడంతో రాష్ర్ట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అవిశ్వాస తీర్మానం విషయంలో ముందుగా స్పందించిన జగన్ రాజకీయ వేడిరాజేస్తే.. తెలుగుదేశం అనివార్యంగా అవిశ్వాస తీర్మానంపై ప్రకటన చేయాల్సి వచ్చింది. కేంద్రంపై పోరాటంలో రాజీలేదన్న చంద్రబాబు.. ఆ పోరాటంలో చివరి అస్ర్తం అవిశ్వాస తీర్మానమే కావాలన్నారు.


అవిశ్వాస తీర్మానం విషయంలో వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాల్ ను జనసేనాని పవన్ కల్యాణ్ స్వీకరించారు.  పార్లమెంట్ లో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు కూడగట్టే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. సీపీఐ, సీపీఎం, బిజూ జనతాదళ్, ఆమ్ ఆద్మీ తో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగడతానని స్పష్టం చేశారు. తనను టీడీపీ పార్ట్ నర్ అన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్.. తాను టీడీపీకి మద్దతు మాత్రమే ఇచ్చానని.. ప్రభుత్వంలో లేనని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా జగన్ వాళ్ల ఎంపీలను సెక్రటరీ జనరల్ దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు..


చంద్రబాబు కంటే ముందుగా పవన్ అవిశ్వాస వాఖ్యలకు ధీటుగా స్సందించిన ప్రతిపక్షనేత జగన్.. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైసీపీ సిద్ధమని ప్రకటించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతామన్నా మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టీడీపీ అవిశ్వాసం పెట్టకపోయినా మార్చి చివరి వారంలో తామే అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు. టీడీపీ, పవన్ కల్యాణ్ లు ప్యాకేజీ అంశాన్ని పక్కన పెట్టి హోదా కోసం పోరాడాలని సూచించిన జగన్... ఏప్రిల్ 6వ తేదీ వరకు ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందిచకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి ప్రస్తుత రాజకీయాలలో ఆసక్తి పెంచారు..


ప్రస్తుతం రాష్ట్రంలో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా పవన్ ప్రకటనను సీరియస్ గా తీసుకున్న అధికార, ప్రతిపక్షాలు ఎక్కడా తగ్గకుండా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమని ప్రజల్లోకి సంకేతాలు పంపుతున్నాయి.. వీరిలో ఎవరు ముందుగా కేంద్రంపై అవిశ్వాసం పెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: