గుజరాత్ లో మాటల యుద్ధానికి నేటితో చెక్..! పోల్ రేసులో నిలిచేదెవరు?

Vasishta

గుజరాత్ ఎన్నికల హోరు చివరి దశకు చేరింది. రెండో దశ పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే సుడిగాలి పర్యటనతో, సభలతో హోరెత్తించిన ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.... చివరి రోజు ప్రచారానికి సిద్దమయ్యారు.


22 ఏళ్లుగా తమతో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తుంటే.... గుజరాత్ కోటలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిపట్టుదలతో ఉంది. నెల రోజులుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీల నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. గుజరాత్ ఎన్నికల పూర్తిస్థాయి ప్రచార బాధ్యతను స్వీకరించిన ఇరు పార్టీల అగ్రనేతలు తమ దైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు..


బీజేపి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి బాధ్యతలను స్వీకరించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న గుజరాత్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ప్రధానిగా తాను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు దాయాది పాకిస్థాన్ తో కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేసినట్లు ఆరోపించారు. తనను అడ్డుతొలగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఘాటుగా విమర్శించారు..


రెండో విడత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో రాహుల్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్, చైనా, జపాన్ అంటూ మోదీ మాట్లాడుతున్నారు తప్ప... గుజరాత్ గురించి మాట్లాడటం లేదన్నారు. బీజేపీ హయాంలో గుజరాత్ లో జరిగిన అభివృద్ధిపై మోదీ నోరు విప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే ఓటుతో మార్కులు వేస్తారన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేవలం కార్పోరేట్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని రాహుల్ ఆరోపించారు.. సాయంత్రంతో గుజరాత్ లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మైకులు, నేతల ప్రసంగాలు, హామీలపై ఓటర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: