అమరావతి : జగన్ కు ఇదే నిజమైన షాక్
ఇది జగన్మోహన్ రెడ్డికి నిజమైన షాక్ అంటే. జగన్ కు ఎంతో నమ్మకస్తుడు, గట్టి మద్దతుదారుల్లో ఒకళ్ళైన మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి ఆళ్ళ రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. అలాంటివి ఉరుములేని పిడుగులాగ రాజీనామా చేసేశారు. దాంతో ప్రభుత్వ వర్గాలతో పాటు పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కొంతకాలంగా పార్టీపైన ఆళ్ళ బాగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేయలేదని అలిగినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందనే నమ్మకం లేదట. కారణం ఏమిటంటే మంగళగిరిలో బీసీ అందులోను చేనేత సామాజికవర్గినికి చెందిన నేతను అభ్యర్దిగా పోటీచేయించాలని జగన్ అనుకున్నారట.
చేనేత సామాజికవర్గానికి చెందిన ముగ్గురు నేతలు మురుగుడు హనుమంతరావు, కోండ్రు కమల, గంజి చిరంజీవి టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో మురుగుడు వయసు చాలా ఎక్కువ కాబట్టి బహుశా టికెట్ మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి దక్కే అవకాశముందని అనుకుంటున్నారు. ఎలాగూ టికెట్ దక్కే అవకాశం లేనపుడు, మంత్రివర్గంలోకి కూడా తీసుకునే అవకాశం లేనపుడు ఇక ఎంఎల్ఏగా ఎందుకని ఆళ్ళ అనుకున్నట్లున్నారు. అయితే టికెట్ దక్కుతుందో లేదో తెలీకపోయినా ఇప్పటికిప్పుడు ఎంఎల్ఏగా రాజీనామా చేయాల్సిన అవసరమైతే లేదు.
ఒకవేళ ఏ కారణంతో ఎంఎల్ఏకి రాజీనామాచేసినా పార్టీకి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటన్నదే అర్ధంకావటంలేదు. ఎంఎల్ఏకి రాజీనామా చేశారంటేనే అసంతృప్తిగా ఉన్నారని అనుకోవాలి. అలాంటిది ఎంఎల్ఏతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారంటేనే ప్రమాదఘంటికలు మోగుతున్నట్లుగా భావించాలి. ఆళ్ళ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశం లేదనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ అనుమతి లేకుండా స్పీకర్ రాజీనామాను ఆమోదించరు. మరి ఆళ్ళ రాజీనామాను జగన్ ఎలా చూస్తారో చూడాలి.