అమరావతి : పురందేశ్వరి ఎల్లోమీడియానే నమ్ముకున్నారా ?

Vijaya

బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఏపీ ప్రస్తుత దుస్ధితికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కారణమన్నట్లుగా ప్రతిరోజు రెచ్చిపోతున్నారు. విభజిత సీమాంధ్రకు మొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు పాలన గురించి పొరబాటున ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. అందుకనే మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరురలు పురందేశ్వరిని దుమ్ముదులిపేస్తున్నారు. టీడీపీకి తాను కోవర్టుగా పనిచేస్తున్నానన్న ఆరోపణలకు పురందేశ్వరి గింజుకుంటున్నారు.



సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తాజాగా అనంతపురం మీటింగులో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో బీజేపీ 175 సీట్లకూ పోటీచేస్తుందని చెప్పారు. ఒకవైపు జనసేనతో పొత్తుండగానే బీజేపీ మొత్తం 175 సీట్లకు ఎలా పోటీచేస్తుందో ఆమే చెప్పాలి. అంటే జనసేనతో పొత్తుండదని పురందేశ్వరికి అర్ధమైపోయినట్లుంది. ఇప్పటికే టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీతో కలిసి వెళ్ళాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారంటే బీజేపీని వదిలేసినట్లే. ఈ విషయంపై అధ్యక్షురాలు డైరెక్టుగా ఎప్పుడూ మాట్లాడలేదు.



ఇదే సమయంలో టీడీపీతో కలిసి జనసేన వెళుతున్నది చూస్తూ కూడా బీజేపీ, జనసేన మిత్రపక్షాలే అని ఇంకా సమర్ధించుకుంటున్నారు. పొత్తువిషయం వచ్చినపుడల్లా ఆ విషయాన్ని ఢిల్లీ నాయకత్వం చూసుకుంటుందని దాటవేస్తున్నారు. ఇపుడేమో జనసేన కలిసిరాకపోతే బీజేపీ 175 నియోజకవర్గాల్లోను పోటీచేస్తుందని పార్టీ మీటింగులో చెప్పారు. నిజంగానే ఇలాంటి ప్రకటనలు పురందేశ్వరి కాకుండా ఇంకెవరైనా ఇస్తుంటే ఎల్లోమీడియా ఈపాటికి చీల్చి చెండాడేసేవే అనటంలో సందేహంలేదు. వైసీపీ ప్రభుత్వంతో పాటు చంద్రబాబు పాలనను కూడా తూర్పారపట్టారన్న ఏకైక కారణంతోనే సోమువీర్రాజుపై ఎల్లోమీడియా ఎంతగా వ్యతిరేకంగా వార్తలు, కథనాలను ఇచ్చిందో అందరు చూసిందే.



వీర్రాజుకు ఎల్లోమీడియాకు చాలాకాలం డైరెక్టు ఫైట్ నడిచింది. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నపుడు ఇదే ఎల్లోమీడియా ఆయనతో బాగుండేది. ఎందుకంటే చంద్రబాబుకు అనుకూలంగా కన్నా మాట్లాడేవారు కాబట్టే. అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే పురందేశ్వరి అచ్చంగా  ఎల్లోమీడియాను మాత్రమే నమ్ముకున్నారని. కేంద్ర నాయకత్వం కన్నా, కేంద్రప్రభుత్వం కన్నా ఎల్లోమీడియాపైనే ఈమె ఎక్కువగా ఆధారపడ్డారు. అందుకనే ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేస్తు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నది. అయితే పురందేశ్వరి మరచిపోయిన విషయం ఏమిటంటే ఎల్లోమీడియాను నమ్ముకున్న వాళ్ళెవరూ ఎక్కువరోజులు లైమ్ లైట్ లో లేరు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: