హైదరాబాద్ : మార్గదర్శిపై సీఐడీ కీలక నిర్ణయం
మార్గదర్శి మోసాలపై దర్యాప్తుచేస్తున్న సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ లో కోటిరూపాయలకు మించి డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు ఇవ్వాలని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డాఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్ (సీడీబీటీ) నిబంధనల ప్రకారమే కోటిరూపాయలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు సీఐడీ తెలిపింది.
అంత పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన విధానాన్ని తెలుసుకునేందుకే తాము ఖాతాదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఐడీ చెప్పింది. మార్గదర్శి ద్వారా మనీల్యాండరింగ్, నల్లధనం లాంటి ఆర్ధికనేరాలకు యాజమాన్యం పాల్పడుతున్నారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మార్గదర్శిలో ఆర్ధిక అవకతవకలపై ప్రత్యేకంగా ఆడిటర్సును పెట్టుకుని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల సాయంతో సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. ఇదే విసయమై రామోజీ ఇంట్లోకి అనుమతించేది లేదని మార్గదర్శి సిబ్బందితో ఆమధ్య గొడవ కూడా జరిగింది.
ఇప్పటికే రెండుసార్లు ఛైర్మన్ ఏ 1 నిందితుడు రామోజీరావు, ఎండీ, రామోజీ కోడలు అయిన ఏ 2 శైలజను సీఐడీ అధికారులు రెండుసార్లు విచారించారు. మూడో విచారణకు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు రమ్మంటే వీళ్ళిద్దరు వెళ్ళలేదు. మరి ఆ విషయమై దర్యాప్తుసంస్ధ ఏమిచేస్తుందో తెలీదు. అయితే గుంటూరు ఆఫీసులో విచారణకు మార్గదర్శి బ్రాంచి మేనేజర్లతో పాటు నోటీసులు అందుకున్న కొందరు కీలకస్ధానాల్లోని వాళ్ళు హాజరయ్యారు.
బహుశా వాళ్ళ ద్వారా సంపాదించిన తాజా సమాచారం ప్రకారమే సీఐడీ మార్గదర్శిలో కోటిరూపాయలకు పైగా డిపాజిట్ చేసిన వాళ్ళ వివరాలు తెలుసుకునుండాలి. అందుకనే ఖాతాదారులకు కూడా నోటీసులిచ్చి విచారణకు రమ్మని అంటున్నది. వాళ్ళకి జారీచేసిన నోటీసుల్లోనే విచారణకు ఎప్పుడు ఎక్కడకు రావాలనే వివరం కూడా ఉందని సీఐడీ చెప్పింది. అంతభారీమొత్తంలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని సీఐడీ చెప్పలేదు. నోటీసులు అందుకున్న ఖాతాదారులు విచారణకు హాజరైతే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరేమవుతుందో చూడాలి.