కోస్తా : ఒంగోలులోనే దేవుడు కనిపించాడా ?

Vijaya


ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చున్నందుకు జగన్మోహన్ రెడ్డి అన్నీ పాపాలను భరించాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు అత్యుత్సాహం చూపించినా సమాధానం చెప్పుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మాత్రమే అనేంతగా జనాల్లో ముద్రపడిపోయింది. ఇపుడింతా ఎందుకంటే ఒంగోలులో బుధవారం అర్ధరాత్రం జరిగిన ఘటనే. గుంటూరు జిల్లాలోని వినుకొండ నుండి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒ కుటుంబం బయలుదేరింది.



మధ్యలో ఒంగోలులో భోజనం కోసం అర్ధరాత్రి కారును నిలిపారు. కొద్దిసేపటికే ఓ కానిస్టేబుల్ వచ్చి ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కారు కావాలని చెప్పి డ్రైవర్ తో సహా బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు. సరే ఆ తర్వాత ఏమి జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. రవాణా శాఖ కానిస్టేబుల్ చేసిన పనికారణంగా సదరు కుటుంబానికి ఒంగోలులోనే దేవదేవుడు కనిపించాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో డైరెక్టుగా జగన్ కు ఏమీ సంబంధంలేదు.



అసలు ముఖ్యమంత్రి కాన్వాయ్ లో మామూలు జనాల కార్లు తీసుకుంటారని కూడా ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరే బోలెడన్ని కార్లుంటాయి. కాకపోతే ఇక్కడ మోటారు వెహికల్ ఇన్సెప్టెకర్ సంధ్య, హోంగార్డు తిరుపతి అత్యుత్సాహం చూపించిన కారణంగానే సదరు కుటుంబం ఊరుకాని ఊరిలో నానా అవస్తలుపడింది. ప్రయాణీకులను ఇబ్బందులు పెట్టినందుకు అధికారులపై యాక్షన్ తీసుకోవటం బాగానే ఉంది. కానీ ఈ విషయం వెలుగు చూడకపోతే ఆ కుటుంబం పరిస్ధితి ఏమిటి ?



అసలు సీఎం కాన్వాయ్ కోసం జనాల దగ్గర వాహనాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? ప్రభుత్వం దగ్గర వాహనాలకు కొదవుందా ? ప్రతిజిల్లాలోను ప్రభుత్వం దగ్గరే కొన్ని వందల వాహనాలుంటాయి. అవన్నీ సరిపోవన్నట్లుగా మామూలు జనాలను బాదాల్సిన అవసరం ఏమొచ్చిందో. ఇప్పటికన్నా బయటపడింది కాబట్టి ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎవరు అత్యుత్సాహం చూపించినా జనాలు తిట్టుకునేది ముఖ్యమంత్రినే. ఇపుడు కూడా జనాలు జగన్నే తప్పుపడుతున్నారు. కాబట్టి జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏమి జరుగుతోందో తెలుసుకుని, ఏమి చేయకూడదో అధికారులకు స్ట్రిక్టుగా చెప్పాలి. లేకపోతే ఇలాంటివి మళ్ళీ పునరావృతమైతే పోయేది జగనే పరువే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: