అమరావతి : పీఆర్సీ వివాదాన్ని అటునుండి నరుక్కొస్తోందా ?

Vijaya


తనచేతికి మట్టి అంటకుండా పీఆర్సీ వివాదాన్ని ప్రభుత్వం అటునుండి నరుక్కొస్తోందా ? జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పీఆర్సీ వివాదంపై గెజిటెడ్ అధికారుల సంఘం కోర్టులో కేసు వేసి దాదాపు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయ్యింది. దానికి అదనంగా ఒక విశ్రాంత ప్రొఫెసర్ సాంబశివరావు కూడా ఉద్యోగుల సమ్మెకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.



పిల్  ప్రకారం చీఫ్ సెక్రటరీ, రెవిన్యు, ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శులతో పాటు పీఆర్సీ సాధన సమితి నేతలకు కూడా నీటీసులు జారీ అవబోతున్నాయి. ప్రొఫెసర్ వాదన ప్రకారం ఉద్యోగులకు అసలు సమ్మెచేసే హక్కేలేదట. వాళ్ళు చేస్తున్న సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా సర్వీసు రూల్స్ కు కూడా పూర్తి విరుద్ధమట. వినటానికే ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. టీకే రంగరాజన్ కేసులో 2003లో సమ్మె రాజ్యాంగ విరుద్ధమని, సర్వీసు రూల్సుకు వ్యతిరేకమని స్వయంగా సుప్రింకోర్టే తీర్పిచ్చింది.



గెజిటెడ్ అధికారుల పిటీషన్ విచారణ సందర్భంగా ఇప్పటికే కోర్టు కూడా పిల్ వేసిన ప్రొఫెసర్ వాదననే తమ అభిప్రాయాలుగా వినిపించింది. ఉద్యోగులకు సమ్మెచేసే హక్కే లేదని తేల్చేసింది.  ఒకవైపు ప్రభుత్వం చర్చలకు రమ్మని ఆహ్వానిస్తుంటే ఉద్యోగుల నేతలు లెక్కేచేయటంలేదు. రేపు కోర్టు నోటీసుల ప్రకారం విచారణకు హాజరైనపుడు ఉద్యోగుల నేతలు ఏమి వాదన వినిపిస్తారో చూడాలి. కోర్టులో కూడా తాము సమ్మెను విరమించేదిలేదనే చెబుతారా ?



అసలు సమ్మెచేసే నైతిక, చట్టబద్దమైన హక్కే లేదని సుప్రింకోర్టు తేల్చి చెప్పిన తర్వాత ఇంకా తాము సమ్మె చేస్తామని చెబితే హైకోర్టు అంగీకరిస్తుందా ? జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వాలకు ఉందని చెప్పింది. హెచ్ఆర్ఏ ని చాలెంజ్ చేసే హక్కే లేదని తేల్చింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని బట్టే జీతాల పెరుగుదల, తగ్గుదల ఉంటుందని కూడా అభిప్రాయపడింది.



ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నించినా ఉద్యోగులు వినటంలేదు. ఈ నేపధ్యంలోనే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకునే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది ప్రభుత్వం. అయితే తనంతట తానుగా చర్యలు తీసుకోకుండా ఆ ముక్కేదో న్యాయస్ధానం నుండి ఆదేశాల రూపంలో వచ్చేట్లుగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరి రేపటి విచారణలో ఉద్యోగుల నేతల వైఖరి ఎలాగుంటుందని పూనే కోర్టు ఆదేశాలు ఆధారపడుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: