లా పాయింట్‌: కొడుకులు లేకపోతే.. ఆస్తులు దక్కేదెవరికి?

Chakravarthi Kalyan
మనది పురుషాధిక్య సమాజం.. అబ్బాయిలు, అమ్మాయిలు సమానం అని ప్రభుత్వం గొంతు చించుకుంటున్నా సమాజంలో ఇంకా మార్పురావడం లేదు.. ఇప్పటికీ మన సమాజంలో పురుషుడికే అన్ని హక్కులూ దక్కుతుంటాయి. ప్రత్యేకించి ఆస్తి హక్కు విషయంలో ఇంకా మహిళలకు అన్యాయమే జరుగుతోంది. పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చిన మొత్తమే తప్ప.. తండ్రి ఆస్తిలో మహిళలకు ఇంకా వాటాలు దక్కడం గగనంగా మారుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆసక్తి రేపుతోంది.

ఓ వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే.. ఆ వ్యక్తి ఆస్తులపై కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని తన తాజా తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ ఆస్తి తండ్రి స్వయంగా సంపాదించినదై ఉండాలి.. అలాగే ఆ తండ్రికి ఆస్తుల విభజన ద్వారా పొందిన ఆస్తులపై కుటుంబంలోని దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

ఈ మేరకు గతంలో  మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చనిపోయిన హిందూ పురుష వ్యక్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ఆస్తిలో హక్కు ఉంటుందని.. వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. తండ్రి మరణించాక ఆస్తులు ఆయన సోదరుడి కుమారుడికి చెందుతాయా..  సొంత కుమార్తెకు చెందుతాయా అనే అంశంపై సుప్రీంకోర్టు 51 పేజీల తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. కుమార్తెలకు, వితంతువైన భార్యకు ఉన్న హక్కును పురాతన హిందూ సంప్రదాయ చట్టాలుస్పష్టంగా గుర్తించాయని తెలిపింది. ఒక హిందూ మహిళ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. అప్పుడు ఆమెకు తన తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు.. ఆ మహిళ  తండ్రి వారసులకు చెందుతాయని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: