"నరేంద్రు"లతో జాగ్రత్త: మోడీ సర్కారుపై కేటీఆర్ షాకింగ్‌ ట్వీట్‌..?

Chakravarthi Kalyan
కొన్నిరోజుల క్రితం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం భేషరతుగా వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో అది చాలా సంచలనం అయ్యింది. సాగు చట్టాలను అమల్లోకి తీసుకురావాలని మోడీ సర్కారు ఎంతో ప్రయత్నించింది. చాలా కాలం పాటు రైతు ఉద్యమాలకు వెరవకుండా మొండి పట్టుదల పట్టింది. అయితే రైతులు కూడా దాదాపు ఏడాది పాటు విరామం లేకుండా పోరాడటంతో కేంద్రం దిగివచ్చింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో రైతులు తమను క్షమించాలంటూ పార్లమెంటులోనే ప్రసంగించారు.

అయితే.. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమరో షాకింగ్ ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న నరేంద్ర సింగ్‌ తోమర్‌.. సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పడం కలకలం రేపుతోంది. ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మరో మూడు అడుగులు ముందుకు వేస్తామని నరేంద్ర సింగ్ అన్నారు. సాగు చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతామన్నారు.

దీంతో నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ .. సాగు చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణలు చెబితే.. మరోవైపు వ్యవసాయ మంత్రి మాత్రం సాగు చట్టాలు మళ్లీ తెస్తామంటున్నారని విమర్శించారు. ప్రధాని క్షమాపణలు చెప్పడం.. సాగుచట్టాల రద్దు చేయడం కేవలం ఎన్నికల స్టంటే అని అనుకోవాల్సిందేనా? అని కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర చట్టాల్ని రద్దు చేశామంటున్నారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర మాత్రం మళ్లీ తెస్తామంటున్నారు.. అంటూ  కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాలు, బీజేపీ సర్కారు పట్ల దేశ రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ తన ట్వీట్‌లో సూచించారు. ఇప్పటికే కేంద్రం అంటే విపరీతంగా మండిపడుతున్న టీఆర్ఎస్‌కు తోమర్ ప్రకటన బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: