కోహ్లీ ఇది కరెక్ట్ కాదు.. బీసీసీఐ షాకింగ్ కామెంట్స్..?
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ అనేక విషయాలపై స్పందించాడు. బీసీసీఐ వైఖరిపై ఘాటుగానే విమర్శించాడు. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తనకు దక్షిణాఫ్రికా పర్యటన కోసం జట్టు ఎంపికకు గంటన్నర ముందే చెప్పారన్నాడు. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దంటూ కోహ్లీని కోరానని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని ఎవరూ కోరలేదని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.
అయితే.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు గంటన్నర ముందే చెప్పారన్న విరాట్ కోహ్లీ వ్యాఖ్యలను బీసీసీఐ ఖండించింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పు గురించి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ కోహ్లీతో ముందుగానే చర్చించాడని చెబుతోంది. అంతే కాదు. కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని బీసీసీఐ అంటోంది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించినప్పుడే ఈ విషయం గురించి అతడితో చర్చించినట్లు బీసీసీఐ తెలిపింది.
టీ-20 జట్టు పగ్గాలు వదులుకునేందుకే కోహ్లీ సిద్ధపడ్డాడని బీసీసీఐ చెప్పింది. ఈ పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు సారథులు ఉంటే జట్టులో సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ అంటోంది. అందుకే వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వివరించింది. వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండురోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.