జగన్ ను చూసి సిగ్గుపడుతున్నా అంటున్న వైసీపీ నేత..?

Chakravarthi Kalyan

అవును.. ఆ వైసీపీ నేత జగన్ ను చూసి సిగ్గుపడుతున్నాడట. ఎందుకో తెలుసా.. తాను రెండు సార్లు మంత్రిగా ఉన్నా కూడా చేయని అభివృద్ధి ఇప్పుడు జగన్ హయాంలో జరుగుతున్నందుకట. ఇంతకీ ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారు.. ఆయనే సి. రామచంద్రయ్య. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నాయకుల వల్లే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. 

 

అడగకుండానే సీఎం జగన్‌ అన్నీ చేసేస్తున్నారని, ఆయన చేతికి ఎముక ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోందని అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. తాను రెండుసార్లు మంత్రిగా పనిచేసినా రాయచోటిలో ఇంత అభివృద్ధి చేయ లేక పోయానని, ఇందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు. జగన్ ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. 

 

అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలల్లోనే వైఎస్‌ జగన్‌ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు

 

ఇక సీ రామచంద్రయ్య గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. 2018 నవంబర్ లో ఆయన వైసీపీలో చేరారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి సీ.రామచంద్రయ్య వైసీపీకి జై కొట్టారు. విజయనగరంలో ప్రజాసంకల్పయాత్రలో వైసీపీ అధినేత జగన్‌‌ను కలిసి పార్టీలో చేరారు. అప్పట్లో రామచంద్రయ్యతో పాటూ కడప జిల్లాకు చెందిన రైల్వే కోడూరు నియోజవర్గ టీడీపీ నేత రాఘవరాజుతో పాటూ పలువురు ముఖ్య నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామచంద్రయ్యకు సీనియర్ నేతగా మంచి పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: