టిడిపిని చావుదెబ్బ కొట్టనున్న జగన్

Vijaya

రాజకీయంగా భవిష్యత్తులో మళ్ళీ తలెగరేయకుండా జగన్మోహన్ రెడ్డి టిడిపిని చావు దెబ్బ కొట్టేందుకు పెద్ద ప్లానే వేసినట్లు సమాచారం. అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అనే రెండు సూత్రాలతో చంద్రబాబునాయుడును కోలుకోనీయకుండా దెబ్బ కొట్టాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే వికేంద్రీకరణ మంత్రాన్ని జపిస్తున్నారు. ఈ విషయం చాపక్రిందనీరులాగ బలంగా అన్నీ ప్రాంతాలకు వెళుతోంది.

 

గడచిన 15 రోజుల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. వెనకబడిన విజయనగరం జిల్లాలో మెడికల్ కళాశాలతో పాటు అత్యాధునిక ఆసుపత్రి నిర్మించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ డిమాండ్ జిల్లా ప్రజల నుండి చాలా కాలంగానే వినిపిస్తోంది. అలాగే ఇప్పటికే మంజూరైన గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. జగన్ గనుక పై రెండు చేయగలిగితే గ్రేట్ అనే చెప్పాలి.

 

ఇక శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి, రీసెర్చి సెంటర్ ఏర్పాటుకు శంకుస్ధాపన చేశారు. ఇది గనుక ప్రారంభమైతే బ్రహ్మాండమనే చెప్పాలి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కొన్ని వేలమందికి ఉపసమనంగా ఉంటుందనే చెప్పాలి.

 

అదే సమయంలో హై కోర్టును కర్నూలుకు తరలించాలని జగన్ డిసైడ్ చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇది గనుక జరిగితే దశాబ్దాల కర్నూలు జిల్లా ప్రజల కల నెరవేరినట్లే.  ఇక ప్రస్తుత అమరావతి ప్రాంతంలో సగానికిపైగా జరుగుతున్న నిర్మాణాలు తప్ప భవిష్యత్తులో  కొత్త నిర్మాణాలేవీ చేపట్టే అవకాశం లేదని సమాచారం.

 

శాస్వత సచివాలయం, అసెంబ్లీతో పాటు రాజ్ భవన్ ను కూడా తుళ్ళూరు మండలంలోని శివారు ప్రాంతాల్లో చేసేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇపుడున్న తాత్కాలిక భవనాలను దేనికో ఓ దానికి వాడుకుంటారంతే. అలాగే కీలకమైన వివిధ శాఖల హెడ్ క్వార్టర్స్ ను కూడా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారట. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబుతో సహా ఎవరూ కాదనలేరు. అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. అభివృద్దితోనే చంద్రబాబును దెబ్బ తీయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. చూద్దాం జగన్ ఎంత వరకూ సక్సెస్ అవుతారో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: