సినిమా వాళ్లు - వ్య‌క్తి పూజ‌... ఆలోచింప‌జేసే ' త‌మ్మిశెట్టి ర‌త్న‌గిరి ' విశ్లేష‌ణ‌త్మాక వ్యాసం..!

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
మితిమీరిన సినిమా పిచ్చి, పరిణితి లేని అభిమానం వెరసి నిండు ప్రాణం బలయ్యింది. అభం శుభం తెలియని బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమను శాశ్వతంగా కోల్పోయారు. మనసును కలిచివేసిన విషాదకర ఘటనకు ఎంతమందిని తప్పు పట్టినా, ఎన్ని కారణాలు చెప్పుకున్నా, తల్లి తండ్రుల విచక్షణా జ్ఞానం ప్రథమ ప్రశ్నార్థకం. మొదటి రోజే సినిమా చూడాలనే తాపత్రయం వారి వివేకాన్ని కప్పివేసింది. సినిమా మొదటి పార్ట్ ఆదరణ పొందటంతో సీక్వెల్ పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది. దానికి తోడు పలు మాధ్యమల ద్వారా వాణిజ్యప్రేరేపిత హైప్ సృష్టించబడిన నేపథ్యంలో తొలిరోజు థియేటర్లలో అభిమానుల తాకిడి, తొక్కిసలాట జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. అభిమానుల భావోద్వేగాలు తారాస్థాయినంటే అటువంటి వాతావరణంలోకి పిల్లలను తీసుకువెళ్ళటంలోని ఔచిత్యం తల్లి తండ్రుల ఇష్టాయిష్టాలు, విజ్ఞతల ఆధారితం.

థియేటర్ కు కథానాయకుని రాకపై యాజమాన్యానికి ముందస్తు సమాచారం ఉందో లేదో స్పష్టం గా తెలియదు. (ఎప్పటికీ తెలియకపోవచ్చు). ఏదిఏమైనా వ్యక్తుల్లో, వ్యవస్థల్లో పేరుకుపోయిన అలసత్వం, నియంత్రణ, భద్రతా చర్యల వైఫల్యాలు విచారణార్హం. సినిమా నటులు కూడా మామూలు మనుషులనే  విషయాన్ని విస్మరించి దైవాంశ సంభూతులుగా భావించటం, వారి క్షణకాల దర్శనం కోసం పరితపించటం అంతుపట్టని ధోరణి. సక్సెస్ సాధించినవారు ఏ రంగానికి చెందినవారైనా అందరిలాంటి మనుషులే కానీ క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర విజయకాంక్ష, తమ అ‌సాధారణ పనితీరుతో విజయశిఖరాలు చేరుకుంటారు. అందుకునే వారికి తప్ప అందించే వారికి ప్రతిఫలమివ్వని (వ్యక్తిగత పరిచయాలు, అవసరాలు లేదా ఆయా రంగాల్లో రాణించాలనుకునేవారు, అవకాశాలు ఆశించేవారికి తప్ప) అభిమానమనే మోజుతో విలువైన సమయాన్ని, భావోద్వేగాలను వెచ్చించి చేసే వ్యక్తి ఆరాధన కంటే వ్యక్తిత్వ ఆరాధన స్వీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని గ్రహించాలి.

సంథ్య థియేట‌ర్ వ‌ద్ద జరిగిన ఘటన సమకాలీన సమాజంలో వేళ్లూనుకున్న వ్యక్తి పూజా మానసికత స్థాయిలను ప్రతిబింబిస్తోంది. ఇటువంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన, అంగవైకల్యం చెందిన వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. మనం అభిమానించే నాయకులకోసం ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో వారు ధన, వస్తురూపేణ కుటుంబానికి సహాయం చేయగలరు లేదా మనకోసం బాధపడగలరు తప్ప విలువైన మన ప్రాణాన్ని తిరిగి తెచ్చివ్వలేరు. బాధ్యతాయుత ప్రవర్తనతో కూడిన పరిణితి చెందిన అభిమానం అందరికీ ఆనందదాయకమని భావిస్తూ...

- త‌మ్మిశెట్టి ర‌త్న‌గిరి, కామ‌వ‌ర‌పుకోట‌, ఏలూరు జిల్లా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: