పవన్ కళ్యాణ్ నిజంగా డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తేనా? : హైపర్ ఆది

Anilkumar
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ వ్యవహారం చర్చనీ అంశంగా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులే పవన్ కల్యాణ్ ఆలోచన, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రశ్నిస్తూ, పార్టీని వీడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో కేవలం 24 సీట్లకే పరిమితం కావడం పట్ల జనసైనికులే కాదు పవన్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ని అభిమానించే కమెడియన్ హైపర్ ఆది దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
" రోజుకి రెండుకోట్లు తీసుకునే ఆయన.. సంపాదించినది అంతా ప్రజలకే పెట్టేస్తున్నారు. దేశ రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు.. కానీ పవన్ కళ్యాణ్‌ గారిలా సాయం చేసింది ఎవరైనా ఉన్నారా? దేశ రాజకీయాల్లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని కులాన్ని తాకట్టు పెట్టాడు.. పార్టీని తాకట్టు పెట్టాడు.. ప్యాకేజ్ తీసుకున్నాడని చాలా ఈజీగా అనేస్తున్నాం. అమ్మ లాంటి కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ డబ్బుకి అమ్ముడైపోతారా? నిజంగా అమ్ముడయ్యే వ్యక్తి అయితే.. ప్రతిపక్షానికి ఎందుకు అమ్ముడవుతాడు... అధికార పార్టీ దగ్గరే డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పార్టీకి అమ్ముడయ్యేవాడు కదా. ఎందుకండీ ఈ మాటలు" అంటూ తన ఆవేదన వ్యక్తంచేశారు.

" పదేళ్లుగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా.. తన కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది. 24 సీట్లే ఏంటి? అని అడుగుతున్న మనం.. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ గారిని కూడా గెలిపించలేదు. కానీ ఇప్పుడు 24 సీట్లు ఏంటని ప్రశ్నించే హక్కు మనకి ఉందా? చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే మనం ఇంట్లో నుంచి బయటకు రాలేం. కానీ ఆయన రెండుచోట్ల ఓడిపోయినా కూడా.. రెండో రోజే ప్రజా సమస్య అనగానే పరుగుపెట్టుకుని వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ గారు. తన పిల్లల కోసం బ్యాంక్‌లో దాచిన డబ్బుని తీసి.. కౌలు రైతులకు సాయం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు మనకి ఉందా?" అని ప్రశ్నించారు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: