అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటితో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చైతూకి జోడిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ‘తండేల్’తో ఈ జోడీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇటీవల ఈ సినిమా నుంచి నాగచైతన్య లుక్ ని రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది
నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఆసక్తికర అప్డేట్ అందించారు. ఇటీవల ఉడిపిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా ఈరోజుతో ఉడిపి షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ వెల్లడిస్తూ సాయి పల్లవి లుక్ ని రివీల్ చేశారు. ఈ లుక్ లో సాయి పల్లవి ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయిల కనిపిస్తూ బీచ్ లో ఒంటరిగా సూర్యోదయాన్ని ఆస్వాదిస్తుంది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన ఫోటోని బట్టి చూస్తే మరోసారి ఈ సినిమాతో సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా అలరించబోతున్నట్లు స్పష్టమవుతుంది.
ఇక ఉడిపి షెడ్యూల్ ముగించుకున్న చిత్ర టీం తదుపరి షెడ్యూల్ ని గోకర్ణ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లోనే సాయి పల్లవి జాయిన్ కానుంది. ఇక్కడ సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. మేకర్స్ ఇంత త్వరగా షెడ్యూల్ పూర్తి చేయడం, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేయడం బట్టి చూస్తే సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి శ్రీకాకుళంకి చెందిన ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఆమె పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి.