మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయా తెలిసిందే. ఆడియన్స్, ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక మహేష్ బాబు తో పోటీపడేందుకు రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు బరిలోకి దిగుతున్నారు. వీళ్ళతోపాటు యంగ్ హీరో తేజ సజ్జ కూడా భాగమవుతున్నాడు. అయితే లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ గుంటూరు కారం సినిమా వల్ల సంక్రాంతికి రిలీజ్ కాబోయే మిగతా సినిమాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఒకేసారి ఇన్ని సినిమాల రిలీజ్ లు ఉండడంతో
థియేటర్స్ కొరతతో పాటూ ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. అందుకే గుంటూరు కారం తో పాటు సంక్రాంతి బరిలోకి దిగాలని చూస్తున్న సినిమాల థియేట్రికల్ రైట్స్ కి ఆశించిన స్థాయిలో రేట్లు పలకడం లేదని అంటున్నారు. దీంతో నిరాశకు లోనవుతున్న పలువురు నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి నుంచి తప్పించాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అందరూ పోటీలో ఉన్నట్టే చెప్తున్నా సంక్రాంతి దగ్గర పడే కొద్ది మార్పులు గ్యారెంటీ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగతా సినిమాలన్నింటికీ సరైన రేట్లు పలకకపోవడానికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమానే ప్రధాన
కారణమని చెబుతున్నారు. ఒకవేళ సంక్రాంతి పోటీలో గుంటూరు కారం లేకపోయి ఉంటే మిగతా సినిమాలకు ఏ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండేది కాదేమో. మరి గుంటూరు కారం దెబ్బతో చివరికి ఏయే సినిమాలు వెనక్కి తగ్గుతాయో చూడాలి. కాగా హారిక అండ్ హాసని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ గుంటూరు కారం సినిమాని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.