బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 'ఆదిపురుష్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా నగ్ కనిపించారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో టీసిరీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేకపోయారు. ఇందుకు కారణం డైరెక్టర్ ఓం రౌత్ సినిమాలో పాత్రధారులను చూపించిన తీరు, నాసిరకం వీఎఫ్ఎక్స్ విపరీతమైన నెగెటివిటీతో పాటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాయి.
దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తొలి రోజు నుంచి ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. మొదటి మూడు రోజులు సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని మేకర్స్ భావించినా కేవలం రూ.360 కోట్లతో సరిపెట్టుకుంది. 'ఆదిపురుష్' తో ప్రభాస్ తన కెరియర్ లో హ్యాట్రిక్ ఫ్లాప్ అనుకున్నాడు. అంతకంటే ముందు డార్లింగ్ నటించిన 'సాహో', 'రాదే శ్యామ్' బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలోనూ సినిమాని చూసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపలేదు.
కానీ రీసెంట్ గా ఈ మూవీని టీవీలో టెలికాస్ట్ చేయగా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడం విశేషం. 'ఆదిపురుష్' మూవీ అక్టోబర్ 29న మొదటిసారి స్టార్ మా చానల్లో టెలికాస్ట్ అయింది. అదే రోజు ఇండియా - ఇంగ్లాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉంది. అయినా కూడా సినిమాకి ఏకంగా 9.4 టీఆర్పీ రేటింగ్స్ రావడం విశేషం. 'ఆదిపురుష్' ఈ రేంజ్ లో రేటింగ్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' లాంటి సినిమాల కంటే 'ఆదిపురుష్' కి టీవీల్లో మంచి టీఆర్పి రేటింగ్స్ వచ్చాయి.