టాలీవుడ్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో 'ఆది పురుష్' కూడా ఒకటి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, అతని సరసన సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఇక వీటితో పాటు సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. సుమారు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో టీ సీరీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ టీంకి ప్రభాస్ ఖరీదైన బహుమతులతో భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆది పురుష్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ సినిమా కోసం పనిచేసిన టీం మొత్తానికి అత్యంత ఖరీదైన ర్యాడో వాచ్ లు గిఫ్ట్ గా పంపాడట ప్రభాస్. ఇక ఈ విషయాన్ని ఆది పురుష్ టెక్నికల్ టీం లోని ఒక సభ్యుడు తెలియజేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవడంతో ప్రభాస్ మంచి మనసుకి అభిమానులతోపాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు కె వంటి సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇక వీటిలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది...!!