కమల్ హాసన్‌కు సర్జరీ.. లేఖ విడుదల చేసిన కూతుళ్లు, వైద్యులు

చెన్నై: మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, సీనియర్ కథానాయకుడు కమల్ హాసన్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చెన్నైలోని శ్రీ రామచంద్ర ఆస్పత్రిలో ఆయన చేరగా.. మంగళవారం ఉదయం ఆయన కాలుకు సర్జరీ చేసినట్టు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘కమల్ హాసన్ కుడి కాలు బోన్‌లో చిన్న ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆయన శ్రీ రామ చంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. బోన్‌లో ఇన్‌ఫెక్షన్‌ పార్ట్‌ను తొలగించేందుకు ఈ రోజు ఉదయం ఆయనకు సర్జరీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు’ అని ఆస్పత్రి వెల్లడించింది.

మరోపక్క కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఓ లేఖను విడుదల చేశారు. తమ తండ్రిపై చూపుతున్న ప్రేమకు వారిద్దరూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రికి జరిగిన సర్జరీ సక్సెస్ అయిందని, వైద్యులు తమ తండ్రిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని అన్నారు. నాలుగైదు రోజుల్లో తండ్రి ఇంటికి వచ్చేస్తారని, కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. అభిమానులను, కార్యకర్తలను కలిసేందుకు ఇప్పుడు కూడా కమల్ హాసన్ సిద్దంగా ఉన్నారంటూ అక్షర హాసన్, శృతి హాసన్ చెప్పుకొచ్చారు.


అసలు కమల్ హాసన్ కాలుకు ఇన్‌ఫెక్షన్ ఎందుకు వచ్చిందంటే.. శభాష్ నాయుడు అనే చిత్రంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్‌లో కమల్ హాసన్‌కు యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలోనే ఆయన కాలుకు సర్జరీ జరిగింది. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా కమల్ లెక్కచేయలేదు. దీంతో ఇన్‌ఫెక్షన్ మళ్లీ రావడంతో.. ఆయన ఇప్పుడు మళ్లీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆయన బిగ్ బాస్ సీజన్ 4ను కంప్లీట్ చేశారు. ఆ షో పూర్తి కాగానే కొద్ది రోజుల పాటు సినిమాలకు, రాజకీయాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: