ఒమిక్రాన్ కల్లోలం: ఆ రాష్ట్రంలో థర్డ్ వేవ్‌ వచ్చేసిందా..?

Chakravarthi Kalyan
ఒమిక్రాన్ అంటే ఏంటో అనుకున్నాం..కానీ.. అది ఇప్పడు తన సత్తా చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్రంలో దాని ప్రభావం బాగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్‌ మొదలైనట్టే ఉంది. నిన్న మొన్నటి వరకూ 500 వరకూ కరోనా కేసులు నమోదయ్యేవి.. ఇప్పుడు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక్క ముంబయిలోనే 2వేల కేసులు దాటిపోతున్నాయి. అంతే కాదు.. ఈ కరోనా వ్యవహారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను కూడా కుదిపేస్తోంది.

ఇటీవల ఐదు రోజులపాటు మహారాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు ఆ సమావేశాలకు హాజరైన 50 మందికి కరోనా వచ్చినట్టు నిర్థరణ అయ్యింది. ఏకంగా ఇద్దరు మంత్రులతో పాటు శాసనసభ సిబ్బంది, పోలీసులకు కరోనా వచ్చేసింది. మొన్నటితో  మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ కరోనా వ్యాప్తి ఇంకెంత మంది ప్రజాప్రతినిధులకు పాకిందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజాప్రతినిధులు అంటేనే దాదాపు 50ఏళ్లు దాటినవారే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు వారు కరోనా ముప్పు ఎదుర్కోవడం అంత సులభం కాదు.

అలాగే మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రంలోనే దాదాపు 200 వరకూ ఒమిక్రాన్ కేసులు కనిపిస్తున్నాయి. ఈ కరోనా వైరస్‌ ఒక్క సారి గ్రాఫ్ పెరిగిందంటే.. అది పెరుగుతూనే పోతుంది. ఈ పెరుగుదల వేగం మహారాష్ట్రంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా ఇప్పుడు ఆ ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ప్రస్తుతానికి లాక్‌ డౌన్ వంటి నిర్ణయాలు ప్రకటించకపోయినా.. నూతన సంవత్సర వేడుకలపై మాత్రం నిషేధం విధించింది. ఈ కరోనా విజృంభణ ఇలాగే ఉంటే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మహారాష్ట్రలో కనిపిస్తున్న సీన్..త్వరలోనే దేశమంతా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: