అమరావతికి జగన్ చేసిన నష్టం.. ఎన్నివేల కోట్లో తెలుసా?

అమరావతి.. చంద్రబాబు 2014లో ప్రారంభించిన రాజధాని. దాని నిర్మాణం కోసం ఆయన ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అయితే.. తన ఐదేళ్ల పాలనలో పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత జగన్ వచ్చాక దాన్ని అటకెక్కించారు. అసలు రాజధానినే మార్చేశారు. మూడు రాజధానులు అన్నారు. ఆ తర్వాత ఆయన్ను జనం ఇంటింకి పంపారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ వచ్చింది. మళ్లీ అమరావతి నిర్మాణం అంటోంది.



అయితే.. గత ఐదేళ్లలో జగన్ అమరావతిని పక్కకు పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఎంతో తెలుసా.. దాదాపు 60వేల కోట్ల రూపాయల పైమాటే. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణ చెబుతున్నారు. 2014-19లో రాజధాని నిర్మాణం కోసం రూ.41 వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చామంటున్నా నారాయణ.. జగన్ రాజధాని నిర్మాణం నిలిపేయటంతో అవే పనులు దాదాపు 60 వేల కోట్ల అంచనాలకు పెరిగాయని చెబుతున్నారు. నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన 42వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగిన తర్వాత ఆయన ఈ వివరాలు చెప్పారు.



రూ.8821 కోట్ల రూపాయల మేర రాజధానిలో పనులు చేపట్టేందుకు అథారిటీ తాజాగా ఆమోదం తెలిపింది. ట్రంక్ రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ రోడ్లు , మంత్రులు, జడ్జిల బంగ్లాల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా అనుమతి ఇచ్చింది. ప్రధాన ట్రంక్ రోడ్ లను రూ.4521 కోట్లతో చేపట్టేందుకు అనుమతి మంజూరు చేసింది. ఎల్పీఎస్ లేఅవుట్ల రహదారుల కోసం రూ.3807 కోట్లకు అనుమతి ఇచ్చిన సీఆర్డీఏ అథారిటీ.. ప్రస్తుతం 236 కిలోమీటర్ల పొడవైన లేఅవుట్ రోడ్లకు అనుమతి మంజూరు చేసింది.



అలాగే 97.5 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే రూ.11,471 కోట్లకు గతంలోనే అనుమతి మంజూరు చేసింది. 41,42వ అథారిటీ సమావేశంలో మొత్తంగా రూ.20,292 కోట్ల మేర పనులకు అనుమతులు ఇచ్చారు. 2014-19తో పోలిస్తే రహదారుల నిర్మాణం కోసం 28 శాతం మేర ధరలు పెరిగాయన్న మంత్రి నారాయణ.. భవనాల నిర్మాణం కోసం 35- 55 శాతం మేర ధర పెరిగిందన్నారు. అదనంగా జీఎస్టీ కూడా 6 శాతం మేర పెరిగిందన్నారు. ఇదంతా జగన్ మూడు ముక్కల ఆట కారణంగా ప్రభుత్వంపై పడిన అదనపు భారం అంటున్నారు నారాయణ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: