చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చిన మోదీ? ఏదో అనుకుంటే ఏదో జరిగిందే?
గత నెలలో వరదలకు ఏపీ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం చిగురుటాకులా వణికిపోయింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ నష్టం సంభవించింది. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో విజయవాడ ముంపు బారిన పడింది. దాదాపు నగరంలో సగ భాగం.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది. సీఎ చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో ఉంటూ సహాయ చర్యలను పర్యవేక్షించారు. అటు కేంద్ర బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. కేంద్రం హెలీకాఫ్టర్లను సమకూర్చడంతో పాటు ఆర్మీని రంగంలోకి దించింది. అయితే అప్పట్లో ప్రధాని మోదీ స్పందించారు. పెను విపత్తుగా అభివర్ణించారు. కేంద్రం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబుకి హామీ ఇచ్చారు.
అయితే నెల రోజులు గడుస్తున్నా కేంద్రం నుంచి సాయం విడుదల కాకపోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే ఏపీ నుంచి వెళ్లిన ప్రత్యేక విజ్ఙప్తి మేరకు కేంద్రం స్పందించింది. ఏపీకి రూ.1036 సాయాన్ని ప్రకటించింది. అయితే ఏపీలో ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం ఉండటంతో మెరుగైన సాయం అందుతుందని అంతా భావించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు. ఏపీకి రూ.1036 కోట్లు, తెలంగాణకు 416.80 కోట్లు మంజూరు చేసింది. ఇక మహారాష్ట్రకు ఏకంగా రూ.1492 కోట్లను వరద సాయంగా ప్రకటించింది.
మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందున అత్యధిక సాయం ప్రకటించినట్లు విమర్శలు వస్తున్నాయి. వరదల వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసింది. వరదలతో దాదాపు రూ.6800 కోట్ల నష్టం జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్రానికి నివేదించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు విజ్ఙప్తులు అందజేశారు. కానీ అవేమీ పనిచేయలేదు. కేంద్రం కేవలం రూ.వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించి చేతులు దులుపుకొందని విమర్శలు వస్తున్నాయి.