బీఆర్ఎస్ పతనం అవుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదు ఎందుకో?
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ అది. 2001లో పుట్టిన పార్టీ.. క్రమంగా ఎదుగుతూ స్థాపించిన 13 ఏళ్లకే లక్ష్యాన్ని చేరుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీని కనుమరుగు చేసింది. వైసీపీని లేకుండా చేసింది. కాంగ్రెస్ ను బలహీనపరిచింది.
దీంతో తెలంగాణలో తామే దిక్కు అన్నట్లు కేసీఆర్ వ్యవహరించారు. అహంకార ధోరణితో పాలించారు అనే అపవాదు మూట కట్టుకున్నారు. ఈ సమయంలో ప్రశ్నించే నాయకులను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అంశాన్ని పక్కన పెట్టేశారు. దీంతో 2018 ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో అహంకారం పనికి రాదని ఓటర్లు తీర్పు ఇచ్చారు. గులాబీ పార్టీని కేవలం 39 సీట్లకే పరిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీని 65 సీట్లతో అధికారం కట్టబెట్టారు. అధికారం కోల్పోవడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలకపోతున్నారు.
కేసీఆర్ అయితే ప్రజల్లోకి రావడానికే ఇబ్బంది పడుతున్నారు. గడిచిన పది నెలల్లో దాదాపు 8 నెలలు ఫాం హౌస్ లోనే ఉన్నారు. ఇక ఇటీవల జైలు నుంచి విడుదలైన కవిత బయటకు వచ్చే పరిస్థితి లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. హరీశ్ రావు అడపాదడపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీని నడిపేవారు లేక.. క్యాడర్ కకలావికలం అవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందనే చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీలో ఉండలేక పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు. అనేక మంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టికి బూమ్ రాంగ్ గా మారాయి. రాష్ట్రంలో పార్టీ దారి తప్పుతున్నా.. ప్రజల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతింటున్నా.. గులాబీ బాస్ మాత్రం బయటకు రావడం లేదు. వీటిపై స్పందించడం లేదు. దీంతో క్యాడర్ లో ఆందోళన నెలకొంది.