కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కష్టమేనా?

ప్రాంతీయ వాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాదాన్ని పక్కన పెట్టింది. తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ వాళ్లేనని.. సెటిలర్లను సైతం ఆకర్షించింది. ఇదే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది. దాదాపు తెలంగాణ అంతటా బీఆర్ఎస్ ను తిరస్కరించినా.. గ్రేటర్ లో సెటిలర్లు మాత్రం గులాబీ పార్టీని ఆదరించారు.


దీంతో గ్రేటర్ లో భారీ గా సీట్లను కైవసం చేసుకొని ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ ప్రదమైన స్థానాలను సాధించింది. కానీ  గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆ పార్టీ భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి కొని తెచ్చుకుంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ల మధ్య జరిగిన పొలిటికల్ వార్ కాస్తా చిలికి చిలికి గాలివానలా తయారైంది. కౌశిక్ రెడ్డి అనూహ్యంగా ఇందులోకి ఆంధ్రా వాదాన్ని తెరపైకి తెచ్చారు.


ఎక్కడి నుంచో అరికపూడి గాంధీ బతకడానికి తెలంగాణ వచ్చి.. ఇప్పుడు తెలంగాణ వారిపైనే దాడి చేస్తారా అంటూ భారీ డైలాగ్ పేల్చారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు గుర్తుకురాని ప్రాంతీయ వాదం ఆయన బీఆర్ఎస్ కు దూరమయ్యాక గుర్తుకు వచ్చిందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావొస్తోంది. హైదరాబాద్ లో ఒక్క ఆంధ్రులే కాదు.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అయినా కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా ఆంధ్రులను అవమానపరిచేలా వ్యాఖ్యానించారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది ఆంధ్రులేనని.. కౌశిక్ రెడ్డి తన నోటి దూలతో బీఆర్ఎస్ కు వారు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీలకు తిరుగులేని అస్త్రాలుగా మారతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇదే సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: