గ్యారంటీల అమలు.. పెరుగుతున్న రేవంత్‌ గ్రాఫ్‌?

మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ సర్కారు కసరత్తులు ప్రారంభించింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 70 రోజులు పూర్తైంది. ఇప్పటి వరకు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారు.

మరోవైపు ఆరు గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారని విపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. రైతు రుణమాఫీకి డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు గ్యారంటీల్లోని మరో రెండింటిని అమలు చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఎం తెలిపారు.

ఈ నెల 27న సాయంత్రం వీటికి శ్రీకారం చుడతామన్నారు.  తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రూ.500కే సిలిండర్ తో పాటు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమానికి ప్రారంభిస్తామని చెప్పారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా హాజరై వీటిని అమలు చేస్తారన్నారు. గృహజ్యోతి పథకానికి అర్హులైన వారు మార్చి మొదటి వారంలో జీరో బిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులు రూ.500 చెల్లిస్తే సిలిండర్ అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలనన్నారు.

ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరగాలని సూచించారు. రూ.500కి సిలిండర్ అందించే పథకంలో ప్రభుత్వ రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా?  లేక ఏజెన్సీకి చెల్లించాలా? ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు , ఇబ్బందులు ఏంటి అనే అంశాలపై సివిల్ సప్లై, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిని సక్రమంగా అమలు చేస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తిరుగుండదు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: