జనసేన- బీజేపీ.. తెలంగాణ సంసారం సాగుతుందా?

ఒక పార్టీతో మరొక పార్టీ భావాలు ఎప్పుడూ కలవవు. అదే జరిగితే వేరే పార్టీ ఎందుకు. రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండాలంటే భావసారూప్యం చాలా అవసరం. దీంతో పాటు సామాజిక రాజకీయ సమీకరణాలు కూడా ముఖ్యమే. అయితే ఒక పార్టీ సైద్ధాంతిక విధానాలు రాష్ట్రానికి బట్టి మారుతూ ఉంటాయా అనే సందేహం ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది.
ఏపీలో జనసేన, టీడీపీ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణ రూపొందించే పనిలో కొంతమంది నాయకులు ఉన్నారు. మ్యానిఫెస్టో కమిటీ కూడా సమావేశమై ఓ ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇన్ని సమావేశాలు జరిగినా ఓ ప్రశ్న అందరిలో అలా ఉండిపోతుంది. అదేంటంటే ఏపీలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కదా.. మరి తెలంగాణలో ఎందుకు కలవడం లేదు.
చంద్రబాబు జైలులో ఉన్నారు కాబట్టి తెలంగాణలో పోటీకి దూరంగా ఉండటమే మంచిదని భావించి ఎన్నికల నుంచి తప్పుకుంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన ఎన్డీయే కూటమిలో టీడీపీ లేదు. కాబట్టి ఆ బీజేపీ, జనసేనకు మద్దతు ఇవ్వడం లేదు సరే. జనసేనతో మంచి సంబంధాలే ఉన్నాయి కదా.  కనీసం జనసేన అభ్యర్థులు పోటీ చేసే ఎనిమిది స్థానాల్లో అయినా  ఆపార్టీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పవచ్చు కదా. ఎందుకు అలా చేయడం లేదు.
మరోవైపు తెలంగాణ టీడీపీ సానుభూతి పరులు అంతా కాంగ్రెస్ కు ఓటేయాలని నిర్ణయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ప్రచారాన్ని ఖండించే సాహసం కూడా టీడీపీ అధిష్ఠానం చేయడం లేదు. జనసేన కూడా మాకు మద్దతు కావాలని టీడీపీని కోరడం లేదేమో అనిపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్ లో జనసేన అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తే వారు అక్కడ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో ఏపీలో ఎన్నికలకు వెళ్లొచ్చు. ఇప్పటికి అయినా ఈ రెండు పార్టీలో తెలంగాణలో మద్దతు విషయంలో ఓ ప్రకటన చేయడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: