ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే?
ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతోంది కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనిచేయాలని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించేందుకు.. తమకు అనుకూలమైన ఓట్లు తప్పనిసరిగా నమోదు అయ్యేట్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ లో భాగంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం కాబట్టి బూత్ లెవల్ ఏజంట్స్ ద్వారా తగిన కసరత్తు పూర్తి చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 60 లక్షలకు పైగా దొంగఓట్లను చేర్పించారని వైసీపీ భావిస్తోంది. వాటిని గుర్తించి తొలగించే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైన అంశం కాబట్టి పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇదే అంశాన్ని వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరిశీలకులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు కూడా గట్టిగా చెప్పారు. తాజాగా జగన్ పార్టీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పారు. పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో బాధ్యతతో పనిచేయాలని అత్యధిక సమయం కేటాయించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. శాసన సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయంతో నియోజకవర్గాలలో అందరూ ఐకమత్యంతో పనిచేసేలా చూడాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.