వామ్మో.. తెలంగాణలో 13 లక్షల మందికి ఆ రోగం?

మారుతున్న కాలంతో పాటు మన జీవన విధానం మారుతోంది. ఈ మార్పులతో కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ జీవనశైలి వ్యాధుల పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతతో ఉండాలి. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా వస్తున్న ఈ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. అందుకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. లేకుంటే ఆ వ్యాధులకు మనం బలి కావాల్సి ఉంటుంది.

అందుకే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి వ్యాధులపై స్క్రీనింగ్‌ చేపట్టింది. ఈ స్క్రీనింగ్‌లో అనేక సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల మందికి రక్త, మూత్ర ఇతర పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 లక్షల మంది అధిక రక్తపోటు అంటే హైబీపీతో బాధపడుతున్నారట. ప్రపంచ అధిక రక్తపోటు దినం సందర్భంగా ఈ పరీక్షలు జరిపారు. గ్లెనిగల్‌ గ్లోబల్‌ ఆసుపత్రి, జాతీయ పోషకాహార సంస్థ ఈ పరీక్షలు నిర్వహించాయి. వీటికి కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా కూడా సహకరించింది.

ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అధిక రక్తపోటుపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ఫలితాలను తాజాగా మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. భాగ్యనగరంలో 9 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..  40.7 శాతం మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. అలాగే  మరో 39.8 శాతం మందిలో అధిక రక్తపోటు ముప్పు పొంచి ఉన్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న స్క్రీనింగ్‌ పరీక్షలు ఔషధాల కోసం రూ.33 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే మందులు రోగులు సక్రమంగా వాడాలని.. దీని కోసం ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో దేశవ్యాప్తంగా తెలంగాణ మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు వివరించారు. మరికొద్ది నెలల్లోనే ఇందులో తెలంగాణ ప్రథమ స్థానంలోకి రానుందని మంత్రి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: