కేసీఆర్.. శత్రువులను పెంచుకుని లాభపడుతున్నారా..?
మొదట్లో కేసీఆర్‌కు కాంగ్రెస్ ఒక్కటే బలమైన శత్రువుగా ఉండేది. ఆ తర్వాత నేనున్నానంటూ బీజేపీ వచ్చి చేరింది. ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా తన మంత్రి ఈటలను తానే మంత్రి వర్గం నుంచి గెంటేసి కొత్త శత్రువును తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిని కావడమే నా ధ్యేయం అంటూ ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల కూడా తెలంగాణ పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టింది. తెలంగాణలో అసలైన ప్రతిపక్షం తానే అంటోంది.
ఇక ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో కేసీఆర్‌కు మరో శత్రువు తయారయ్యారు. బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యమని నినదిస్తున్నాడు. దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో అని పాటలు కూడా పాడుతున్నారు. ఇక పాత శత్రువే అయినా ఇప్పుడు కొత్తగా తీన్మార్ మల్లన్న కూడా జోరు పెంచేశాడు. అందరికంటే భిన్నంగా సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు తీన్మార్ మల్లన్న. తాజాగా ఈ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కేసీఆర్ సోదాలు చేయించారు.
మొత్తం మీద ఇప్పుడు కేసీఆర్ శత్రువుల జాబితా తీస్తే అది చాలా పొడగవుతుంది. అయితే విచిత్రం ఏంటంటే.. ఇంత మంది శత్రువులను తయారు చేసుకోవడం ద్వారా కేసీఆర్ లాభపడుతున్నారు. వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు గణనీయంగా చీలే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయి అది అంతిమంగా కేసీఆర్‌కు లాభాం చేకూర్చేలా కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..?