ఆ ఒక్క లేఖతో.. నవ్వుల పాలైన జగన్..?

ఏపీ సీఎం జగన్ ఒక్క లేఖతో నవ్వుల పాలయ్యారు.. నిజమే.. వ్యాక్సీన్ల విషయంలో ముఖ్యమంత్రులం అందరం సింగిల్ వాయిస్‌తో కేంద్రాన్ని నిలదీయాలంటూ జగన్ నిన్న దేశంలోని ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశారు. ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ ఇలాగే లేఖ రాశారు. ఆయన తరహాలోనే జగన్ కూడా లేఖ రాశారు. అయితే పినరయి విజయన్ లేఖ రాసినప్పుడు అంతా ప్రశంసించారు. కానీ అదే తరహాలో జగన్ లేఖ రాస్తే మాత్రం నవ్వుకున్నారు.

వ్యాక్సీన్ల కోసం రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని జగన్‌ గుర్తు చేశారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని... ఈ వ్యవహారం చూస్తే.. వ్యాక్సిన్ లభ్యతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం వచ్చేలా ఉందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్రాలన్నీ పరస్పరం సహకరించుకోవాలన్న జగన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరం కోరదామని ప్రతిపాదించారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని లేఖలో వెల్లడించారు.

పినరయి విజయన్ లేఖ రాసినప్పుడు అంతా ప్రశంసించారు. కానీ అదే తరహాలో జగన్ లేఖ రాస్తే ఎందుకు నవ్వుకున్నారు. ఎందుకంటే.. ఇదే జగన్.. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్ సీఎం వ్యాక్సీన్లపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే.. అబ్బే హేమంతూ అలా పెట్టకూడదయ్యా అంటూ సుద్దులు చెప్పారు. అవసరం లేకపోయినా మోడీ సర్కారును వెనుకేసుకొచ్చారు. మనం ఐక్య భారత దేశం.. వ్యాక్సీన్ల వంటి అంశంలో మనం ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ నీతులు చెప్పారు.

ఇంతకీ అప్పుడు జార్ఖండ్ సీఎం ఏమన్నాడూ.. వ్యాక్సీన్ల విషయంలో మోడీ మా మాట పట్టించుకోవడం లేదు అనే కదా.. ఇప్పుడు పరోక్షంగా జగన్ ప్రత్యేకంగా లేఖలు రాసి మరీ చెబుతున్నదీ అదే.. మరీ ఇంత తక్కువ సమయంలోనే ఇలా వైఖరి మార్చేసుకుంటే.. జనం నవ్వుకోరా మరి. ఇలాంటి విషయాల్లో జగన్ సంయమనం పాటిస్తే బెటర్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: