హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్సార్ ను ’మహానేత’ని ఎందుకంటారో తెలుసా ?
దాదాపు నలబై సంవత్సరాలుగా వైఎస్సార్ రాష్ట్ర రాజకీయాల్లో అసమ్మతి కార్యక్రమాల కారణంగానే బాగా పాపులరయ్యాడన్నది వాస్తవం. వైఎస్సార్ కన్నా బాగా సీనియర్లు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో వైఎస్స్ నిత్యమూ ఏదో ఒక అసమ్మతిని రాజేస్తునే ఉండేవాడు. దాంతో సమైక్య రాష్ట్రంలో పై నేతలంటే పడని వారికి వైఎస్ ఓ ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అందుకనే అప్పట్లో రాష్ట్రంలోని ఏమూలకు వెళ్ళినా వైఎస్ కు మద్దతుదారులుండేవారు. అలా అలా మద్దతుదారులను పెంచుకుంటూ వెళ్ళాడు. చివరకు సీనియర్లందరు ఒకరి తర్వాత మరొకరు కాలధర్మం చెందే సమయానికి కాంగ్రెస్ లో వైఎస్ కు తిరుగులేకుండా పోయింది. అదే సమయంలో వైఎస్ కు కూడా కొందరు వ్యతిరేకులుగా తయారయ్యారు. తన వ్యతిరేకులను నిలువరించటంలో పార్టీలో తన ఉనికిని ఘనంగా చాటుకుని తిరుగులేని నేతగా ఎదిగేందుకే వైఎస్సార్ పాదయాత్రను చేశాడు.
వైఎస్ పాదయాత్ర పూర్తి చేయటం, చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత పెరిగిపోవటం, ఎన్నికలు రావటం.. అంతా కలిసి వైఎస్ కు జనాల్లో ప్రత్యేకమైన ఇమేజిని తెచ్చిపెట్టాయి. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటితో 2004లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేయాలనే చాయిస్ అధిష్టానానికి లేకుండా కేవలం తాను తప్ప మరో ఛాయిస్సే లేదనే పరిస్ధితులు కల్పించటంలో వైఎస్ సక్సెస్ అయ్యాడు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ శఖం ఆరభమైనట్లయ్యింది. సిఎం అయినప్పటి నుండి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నున్నా ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్, ఉచిత వ్యవసాయ విద్యుత్ అనగానే వైఎస్సారే గుర్తుకొస్తాడు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ప్లానింగ్, శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం-ప్రారంభోత్సవం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, జలయజ్ఞం లాంటి అభివృద్ధి కూడా వైఎస్ హయాంలోనే జరిగింది.
ఇదే సమయంలో వైఎస్ పై అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా ఆయన ఇమేజికి ఏమాత్రం డ్యామేజి కాలేదు. ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్, జలయజ్ఞం లాంటి కార్యక్రమాల అమలు ముందు అవినీతి ఆరోపణలు కొట్టుకుపోయాయి. అందుకనే 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అప్పటి ప్రతిపక్షాల నేతలు చంద్రబాబునాయుడు, కేసీయార్, వామపక్షాలు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దాంతో ప్రత్యేక తెలంగాణా వాదన కూడా గాలికి కొట్టుకుపోయింది. అంటే 2009 ఎన్నికల నాటికి పార్టీలోనే కొందరు తెలంగాణా నేతలు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే వైఎస్ ఇమేజి ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. పైగా రెండోసారి కూడా అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నేతలతో పాటు కేసీయార్ నోరు కూడా మూతపడిపోయింది.