దారుణం: ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వోద్యోగులు?

ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయినట్టే భావిస్తారు చాలా మంది. కానీ అన్ని ఉద్యోగాలు అలా ఉండవు. అందుకు ఉదాహరణ వీఆర్‌ఏ. తెలంగాణలో వీఆర్ఏలు ఉపాధి హామీ కూలీల కంటే దీనమైన పరిస్థితిలో బతుకు వెళ్లదీస్తున్నారు. ఏళ్లకేళ్లు కష్టం చేసినా వారికి ప్రమోషన్లు లేవు. పదోన్నతుల కోసం ఎదురు చూసి కళ్లు కాయలు కాస్తున్నాయి. వయసు పరిధి దాటి పోవడంతో మరో ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నారు. ఇటు ఉన్న కొలువుతో బతుకు బండి నడపలేక వీఆర్‌ఏలు నరకయాతన అనుభవిస్తున్నారు.

గతంలో సీఎం కేసీఆర్ పేస్కేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని వీఆర్‌ఏలు ఆశించారు. అంతే కాదు.. ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని వీఆర్‌ఏలు భావించారు. వాస్తవానికి వీఆర్‌ఏ ఉద్యోగం పార్ట్ టైమర్‌ ఉద్యోగమే.. కానీ  పేరుకే పార్ట్ టైమర్లు తప్ప వీరికి ఫుల్ టైమర్ల కంటే ఎక్కువ పని భారం ఉంటోంది. ఇలాంటి  వ్యవస్థ తెలంగాణలో ఏదైనా ఉందంటే అది వీఆర్ఎల వ్యవస్థ మాత్రమే.

మరో విషయం ఏంటంటే.. వీఆర్ఏల్లో 90 శాతం బీసీలు, దళిత వర్గాల పిల్లలే ఉన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్‌ఏలు సుమారు 30 రకాల విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే.. కేసీఆర్ సర్కారు 2020లో వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేసింది. దీంతో వీఆర్ఎల పై పని భారం ఇంకాస్త పెరిగింది. ఓవైపు చాలీ చాలని జీతం.. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి.. ఈ టెన్షన్‌తో కొందరు వీఆర్ఎలు గుండెపోటుకు గురై చనిపోతున్నారు కూడా. గతంలో నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వీఆర్ఎలు ఆత్మహత్య కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

ప్రస్తుతం వీఆర్‌ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె  50 రోజులకు చేరింది. ఈ సమ్మె సమయంలోనూ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి కొందరు గుండెపోటుతో చనిపోయారు. అయినా ప్రభుత్వం మాత్రం వీరి సమస్యపై దృష్టి సారించడం లేదని వీఆర్‌ఏలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: