తెలంగాణలో కరెంట్‌ కష్టాలు.. నిజమెంత?

Chakravarthi Kalyan
తెలంగాణలో కరెంటు కష్టాలు మొదలయ్యాయా.. కాంగ్రెస్ పాలనలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయా.. జనం ఇబ్బందులు పడుతున్నారా అంటే అవునని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే.. తెలంగాణలో విద్యుత్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుండి గణనీయంగా మెరుగుపడిందని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామ‌ని, గత ప్రభుత్వం 2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశామని చెబుతోంది.

ప్రస్తుత ఏడాది జనవరి 1 నుండి 28 వరకు, రాష్ట్రంలో సగటున 242.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారట. గతేడాది ఇదే కాలంలో సగటున 226 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయ్యింద‌ట. వ‌చ్చే నెల ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2024 వరకు విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి తగిన‌ చర్యలు తీసుకున్నామ‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారు. వ‌చ్చే వేస‌విని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివిధ రాష్టాల‌తో జ‌రిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం1,200 మెగావాట్ల విద్యుత్తును ముంద‌స్తుగా రిజ‌ర్వు చేసుకున్నామ‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

అంతేకాదు.. ఆయా రాష్ట్రాల‌లో విద్యుత్తు కొర‌త ఉన్నప్పుడు తిరిగి ఇవ్వడం జ‌రుగుతుంద‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  అన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో ఎలాంటి అంత‌రాయం లేకుండా ముంద‌స్తుగా మెయింటేనెన్స్ ప‌నులు కూడ చేప‌ట్టామ‌న్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క .. నాణ్యమైన‌ విద్యుత్తును కోత‌లు లేకుండా స‌ర‌ఫ‌రా చేయాడానికి కావాల్సిన చ‌ర్యలు తీసుకున్నామ‌ని వెల్లడించారు. ఇందిర‌మ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమ‌ని, ప్రజల కలలు నిజం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమ‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  అన్నారు. మరి ఈ లెక్కల్లో నిజమెంతో.. కరెంటు కష్టాలపై జరుగుతోంది ప్రచారమేనా అన్న విషయం జనమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: