రామ మందిరం ఒక్కటి చూసి జనం బీజేపీకి ఓట్లేస్తారా?

Chakravarthi Kalyan
అయోధ్య రామమందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తేదిన ప్రకటించినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో ఒక ముఖ్యమైన చర్చ జరగుతూ వస్తోంది. మందిర నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ తేదీని ఎందుకు ప్రకటించారు. అది కూడా లోక్ సభ ఎన్నికలకు ముందే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అన్నది చర్చ. దీంతో ప్రతిపక్షం ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించింది. శంకరాచార్యులు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, అనుబంధ సంఘాలు ఇంటింటికీ అక్షింతలు పంపిణీ చేశాయి. కలశ యాత్రలు, ర్యాలీలు నిర్వహించాయి. దేశంలోని చాలా ప్రాంతాలు కాషాయ రంగుతో నిండి భక్తి వాతావరణం కనిపించింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అందుకే దీనిని రాజకీయ కోణంలనే ప్రతిపక్షాలు చూశాయి. రామమందిర ఉద్యమం హిందువుల్లో మోజార్టీ వర్గాన్ని ప్రభావితం చేయడమే కాకుండా భారత రాజకీయాలను సమూలంగా మార్చేసిందనే చెప్పాలి. అయోధ్యలో రామమందిర సమస్య రాజకీయాల్లోకి రావడంతో ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా బీజేపీ రాజకీయంగా బలంగా నిలబడటానికి అయోధ్య రామ మందిర అంశం తోడ్పడింది. ఈ సారి అది బీజేపీ విజయానికి ఉపయోగపడుతుందా అంటే వేచి చూడాలి.

2014,19 లోక్ సభ ఎన్నికల సమయంలో హిందూ ఓటర్లలో జరపిన సర్వేలో వెల్లడైన డేటాను సెఫాలజిస్ట్ లోక్ నీతి సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ వివరించారు. దేవాలయాలకు వెళ్లేవారు..మత విశ్వాసం ఉన్నవారు బీజేపీకి ఓటేశారు. కాబట్టి ఈసారి కూడా రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పడే మతపరమైన వాతావరణం కారణంగా వారంతా మళ్లీ బీజేపీవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. దీనితో భారత రాజకీయాల్లో అయోధ్య రామమందిర అధ్యాయం ముగుస్తుందా లేదా అనేది వచ్చే ఎన్నికలు నిర్ణయిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: