ఉక్రెయిన్: రష్యాకు చావుదెబ్బ - 500 మంది మృతి?

Chakravarthi Kalyan
పొరుగున ఉన్న ఉక్రెయిన్‌ ను సులభంగా లొంగతీసుకుంటామనుకున్న రష్యా అధినేత పుతిన్ అంచనాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. వారం అవుతున్నా ఇంకా ఉక్రెయిన్ రష్యాకు ధీటుగా పోరాడుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఇంకా ఉక్రెయన్ సేనల ఆధీనంలోనే ఉంది. అంతే కాదు.. ఈ యుద్ధంలో అనూహ్యంగా రష్యా కూడా తీవ్రంగానే నష్టపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా కూడా అంగీకరిస్తోంది. ఎందుకంటే.. ఈ యుద్ధం ప్రారంభం అయ్యాక.. రష్యా తొలిసారి తన సైన్యం ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసింది.


ఇప్పటి వరకూ ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైనికులు 498 మంది చనిపోయినట్లు రష్యా మిలిటిరీ అధికారికంగా వెల్లడించింది. అధికారికంగానే వెల్లడించిందంటే.. అసలు సంఖ్య దీనికి కొన్ని రెట్లు ఉండొచ్చచని అంచనా వేస్తున్నారు. ఇంకా రష్యా ఏమని చెబుతుందంటే.. ఈ యుద్ధంలో 2,870 మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయినట్లు  వెల్లడించింది. వీరితో పాటు మరో   572 మందిని బందీలుగా పట్టుకున్నామని రష్యా మిలటరీ చెబుతోంది.


అయితే.. ప్రాణ నష్టంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతున్న లెక్కలు మరోలా ఉన్నాయి.   యుద్ధంలో ప్రాణనష్టంపై ప్రకటన చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. ఆరు రోజుల్లో 6వేల మంది రష్యా సైనికులు చనిపోయారని చెబుతున్నారు. మరి అసలు వాస్తవం ఏంటి.. ఎంత మంది రష్యా సైనికులు చనిపోయారన్నది తేలాల్సి ఉంది. ఈ రెండు దేశాల వాదనలు విన్న తర్వాత కనీసం 1000 నుంచి 2000 వేల మంది సైనికులను రష్యా కోల్పోయి ఉండొచ్చని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు.


దీనికితోడు రష్యాకు ఉక్రెయిన్ ఆక్రమణ అంత సులభంగా ఏమీ లేదు. అసలు ఉక్రెయిన్‌పై యుద్ధం వద్దంటూ సొంత దేశంలోనే రష్యాకు నిరసన ఎదురవుతోంది. మాస్కోలోనూ నిరసనలు జరుగుతున్నాయి. మరో సంచలన విషయం ఏంటంటే.. రష్యా సైనికులు యుద్ధం ఇష్టం లేక.. కావాలనే తమ సొంత వాహనాలను ధ్వంసం చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెలువరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: