మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
చమురు కంపెనీలు షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో ప్రజల్ని గ్యాప్ లేకుండా ధరల పేరుతో చావబాదుతున్నాయి. తాజా ధరలతో లీటరు పెట్రోలుపై 34 పైసలు, లీటరు డీజిల్‌పై 37 పైసలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు రూ. 108.96, డీజిల్ ధర రూ.102లుగా ఉంది. చమురు కంపెనీలు ధరల పిడుగులను కురిపిస్తున్నాయి. ప్రజలను వరుసపెట్టి చావబాదుతున్నాయంటే అతిశయోక్తి కాదు. మే నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ ధరల పేరుతో పెట్రోలు, డీజిలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు, డీజిల్ ధరకు సెంచరీ కొట్టాయి. ప్రజలు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మండిపడుతున్నారు. ఎన్నిసార్లు అబద్దాలు చెబుతారని, చెప్పేవాటిలో ఒకటి కూడా నిజం లేదని, ప్రజల్ని ధరల పేరుతో తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. గ్యాస్ పై రాయితీ కూడాఎత్తేశారని, ఇప్పుడు వీటిపై కూడా రాయితీ ఎత్తేస్తే సైకిళ్లు, లేదంటే నడుచుకుంటూ వెళతామంటున్నారు. కంపెనీలు ధరలు పెంచడమేకానీ తగ్గించడమనేది తెలియదని, మేం చెల్లిస్తున్న పన్నులన్నీ ఎటుపోతున్నాయని అడుగుతున్నారు.