నదియా : ఐసిస్ లైంగిక బానిసత్వం నుండి నోబెల్ బహుమతి వరకు! జీవితం విలయం అయినా...!

మాతృమూర్తి సోదరి కూతురు భార్య మొదలైన అత్యంత గౌరవనీయమైన వ్యక్తులు మానవ వికాసంలో ప్రధాన పాత్ర వహిస్తారు. అలాంటి మగువను నేడు కొందరు మానవత్వం లేని వ్యక్తులు రకరకాల సిద్ధాంతాలను సృష్టించి మృగాలుగా మారి లైంగిక హింసకు గురిచేస్తున్నారు. 


నరరూప రాక్షసులకు నిలువెత్తు రూపం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. కనికరం అన్నదే ఉండదు. ఆడవాళ్ల పట్ల ఎంతో అరాచకంగా ప్రవర్తిస్తుంటారు. తమ కోరికల కోసం మహిళల దగ్గర నుంచి 12 ఏళ్ల బాలికల పట్ల కూడా చాలా కర్కశంగా వ్యవహరిస్తారు. కళ్లెదుటే తోటి ఆడపిల్లలు వారి బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అడ్డు చెప్ప లేని పరిస్థితి తోటి మహిళలది. ఒకవేళ ఎదురుతిరిగితే చావే శరణ్యం.  అంతటి నరకం చూపించే ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకు రావాలంటే మామూలు విషయం కాదు. ఒక వేళ తప్పించుకుంటూ దొరికినా ఇక అంతే. అంతటి నరకకూపం నుంచి తప్పించుకుని వచ్చింది ఓ వీరనారి ఆమె పేరే నదియా మురాద్. 


లైంగిక బాధితురాలిగా ఉగ్రవాదుల చేతుల్లో సామూహిక అత్యాచారాలకు గురై తల్లిని, తోబుట్టువులను కళ్లెదుటే ఉగ్రవాదులు మట్టుబెడుతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ఆమెది. అంతటి దుర్భర జీవితాన్ని అనుభవించిన ఆమె అత్యంత ప్రతిష్టాత్మక మైన పురస్కారం నోబెల్ శాంతి బహుమతి అందుకోబోతుంది. అయితే నోబెల్ బహుమతి అందుకోబోతున్న నదియా మురాద్ చీకటి జీవితాన్ని తెలుసుకుంటే ప్రతీ ఒక్కరి మనసు చెమ్మగిల్లాల్సిందే. 


ఇరాక్ దేశంలోని సింజర్ ప్రాంతంలో తల్లి, అన్నదమ్ములతో ఎంతో సంతోషంగా ఉండేది 23 ఏళ్ల నదియా మురాద్. సింజర్ ప్రాంతం సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో యాజిదీ తెగకు చెందిన ప్రజలు నివశిస్తుంటారు. సిరియా సరిహద్దు ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారు చేసే ఆకృత్యాలు అన్నీఇన్నీ కావు. మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఉంటాయి. యాజిదీ స్త్రీల పట్ల ఉగ్రవాదులు క్రూరంగా వ్యవహరిస్తారు. 


2014లో నదియా మురాద్ నివశిస్తున్న సింజర్ ప్రాంతానికి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. నల్లని జెండాలతో ట్రక్కుల్లో వచ్చిన ఉగ్రవాదులు నదియా నివాసం ఉంటున్న కోచోలో ఇళ్లలోకి చొరబడి పురుషులను హతమార్చారు. బాలురలను మాత్రం చంపకుండా ట్రక్కుల్లో వేసుకుని తీసుకెళ్లిపోయారు. ఆ చిన్నపిల్లలను బంధించి ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్లిపోయారు. 


కోచో ప్రాంతం అంతా నెత్తురోడింది. నదియా మురాద్ కళ్లెదుటే తల్లిని, సోదరులను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఆ తర్వాత నదియాను ఆమెతోపాటు మరో వేలాది మంది మహిళలు, బాలికలను ట్రక్కుల్లో వేసుకుని అపహరించుకుపోయారు. వారందరిని మోసూల్ ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నచిన్న గదుల్లో బంధించారు. పనివాళ్లుగా, లైంగిక బానిసలుగా మార్చేశారు. అలా నదియా మురాద్ లైంగిక బానిసరాలుగా మారిపోయింది. 


నచ్చిన వారిని బలవంతంగా ఇస్లాం మతం లోకి మార్చి పెళ్లిళ్లు చేసుకునేవారు. సంప్రదాయంగా ఉండే అమ్మాయిల చేత బలవంతంగా మేకప్ వేయించి తమకు ఇష్టం వచ్చినట్లు డ్రస్సులు వేయించి ఒక అంగడి బొమ్మలా ఆడుకునేవారు. తమ కామకలాపాలకు అంగీకరించని వారిని హతమార్చేవారు. విపరీతంగా కొట్టి హింసించారు. కొంతమంది యాజిదీ మహిళలను బాలికలను మార్కెట్లో అమ్మేసేవారు.  మోసూల్ కొన్ని నెలలపాటు నదియాపై ఉగ్రవాదులు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. నరకయాతన అనుభవించింది నదియా. ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి జిహాదీలు తమపై అత్యాచారాలకు పాల్పడేవారని ఒప్పుకోకపోతే గొడ్డును బాదినట్లు బాదేవారు.


నదియాను అపహరించుకుపోయిన కొత్తలో అత్యాచారం చెయ్యబోతుండగా వారితో పోరాడింది. పోరాడి పోరాడి ఆ రాక్షసుల ముందు ఓడిపోయింది. దీంతో ఆ కామాంధుల చేతుల్లో నరకయాతన అనుభవించింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా జిహాదీలు పశువుల్లా ప్రవర్తిస్తుండటంతో తట్టుకోలేక మూర్చిల్లిపోయిన రోజులు కోకొల్లలు.    


అలా ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో నానా యాతన అనుభవిస్తున్న నదియా మురార్ ఆ నరకం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. తప్పించుకునే సమయంలో వారికి పట్టుబడితే మరణం తప్పదని తెలుసు. అయినా ధైర్యం తెచ్చుకున్న ఆమె అమెరికా సేనలు దాడులు జరుపుతున్న సమయంలో అవకాశం చూసుకుని తప్పించు కుని బయటపడింది. 


అందుకు అప్పటికే ఉగ్రవాదుల చెరలో బంధీలుగా ఉన్నఓ ముస్లిం కుటుంబం సాయంతో మోసుల్ నగరం నుంచి తప్పించుకుంది. నకిలీ పత్రాలతో వేల కిలోమీటర్లు ప్రయాణించి యాజిదీలు ఉండే సహాయక శిబిరాలకు చేరుకుంది. అప్పటికే తల్లి ఆరుగురు సోదరులు చనిపోయారని తెలుసుకుని దు:ఖించింది. జర్మనీలో తన సోదరి ఉంటుందని తెలుసుకుని ఓ సంస్థ సహాయంతో అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె జర్మనీలోనే ఉంటోంది. 


అయితే 2015లో నదియా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాను ఎదుర్కోన్న కష్టాలు, ఐసిస్ ఉగ్రవాదుల ఆకృత్యాలను చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. ఉగ్రవాదు ల చెరనుంచి బయటపడిన నదియా ఆమెపడ్డ నరకం గురించి చెప్తే సభ్యులు గగుర్పాటుకు గురయ్యారు. ఆమె కష్టాలను నరకాన్ని చూసి యావత్ ప్రపంచం చలించి పోయింది.  


జిహాదీలు నాతోపాటు ఉన్న యాజిదీ మహిళలను జంతువుల కంటే హీనంగా చూసే వారని అత్యాచారం చేస్తున్న సమయంలో అంగీకరించకపోతే క్రూరంగా గొడ్డును బాదినట్లు బాదేవారని చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. ఎలాగైనా ఆ నరకం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించానని దొరికితే చంపేస్తారని తెలిసి కూడా సాహసం చేసి తప్పించుకున్నానని ఐరాస మీటింగ్ లో చెప్పింది. 


తాను నరకకూపం నుంచి బయటకు వచ్చిన తర్వాత నరకకూపంలో మగ్గుతున్న యాజిదీ మహిళలను కాపాడటానికి తన జీవితాన్ని అంకితం  చేస్తున్నట్లు ప్రకటించింది. తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆచూకీ లేని 3వేల మంది యాజిదీల ఆచూకీ కోసం ఆమె ప్రయత్నిస్తూనే ఉంది.  తనపై జరిగిన అకృత్యాల గురించి, యాజిదీ మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి నదియా ఐరాస భద్రతా మండలిలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చెప్పింది.


ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ఐరాస నదియాను గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమించింది. నదియా జీవితాన్ని తెలియజేస్తూ 2017లో ‘ది లాస్ట్‌ గర్ల్‌’ అనే పుస్తకం విడుదలైంది. లైంగిక హింసను అరికట్టేందుకు ఆమె చేస్తున్న కృషికి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: