ఏపీ: జగన్ పని అయిపోయిందంటున్న బావ 'బ్రదర్' అనిల్ కుమార్?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలవేళ అధికార పార్టీ వైస్సార్సీపీపైన ఒకవైపు కూటమి, మరోవైపు చెల్లెలు షర్మిల మూకుమ్మడిగా దాడి చేస్తుండడం అందరికీ తెలిసినదే. ఇపుడు అది చాలదన్నట్టు షర్మిల భర్త 'బ్రదర్' అనిల్ కుమార్ కూడా బావ జగన్ పైన దాడి చేయడం మొదలు పెట్టాడు. గత ఎన్నికల్లో క్రిస్టియన్, మైనారిటీ ఓట్లతో అత్యధికంగా లబ్ధి పొందిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ఈసారి అదే ఓటర్లు గుణపాఠం చెప్పే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కుమార్ రాష్ట్రమంతా తిరిగి క్రిస్టియన్ల ఓట్లన్నీ వైసీపీకి పడేలా కృషి చేసిన సంగతి విదితమే. ఇపుడు ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తుండడం కొసమెరుపు.
ఇకపోతే కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో ఉన్న కారణంగా ఆమె గెలుపుకోసం బ్రదర్ అనిల్ కుమార్ పాటుపడుతున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలో ఫాస్టర్లు, క్రైస్తవులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అయన అనేక వ్యాఖ్యలు చేసారు. ఈ ఆదివారం కడపలో పలు చర్చిల్లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న అనిల్ కుమార్ జగన్ పైన అనేక విమర్శలు చేసారు. పాపులను తొక్కి పడేయాల్సిన సమయం ఆసన్నం అయిందని, ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేసి వైసీపీ ఓట్లను చీలుస్తారని ఈనెల 25న జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సభలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఇక దేశ విదేశాల్లో క్రైస్తవ మత ప్రభోధకుడుగా మంచి పేరున్న బ్రదర్ అనిల్ కుమార్ మాటకు క్రైస్తవులు చాలా విలువ ఇస్తారు. అందులో భాగంగా రెండు రోజుల నుంచి ఆయన కడప పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారు. శనివారం ప్రొద్దుటూరులో ఫాస్టర్లతో సమావేశం నిర్వహించి ఈసారి జగన్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పడడానికి వీలు లేదని దిశా నిర్దేశం చేశారు. ఇక ఆదివారం క్రైస్తవులు తప్పకుండా చర్చిలకు వెళ్తారనే ఉద్దేశంతో, కడప నగరంలోని పలు ప్రముఖ చర్చిల్లో బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేయడం కొసమెరుపు. ఈ క్రమంలో క్రైస్తవ బోధనలను వారికి వివరించారు. కడప రాజారెడ్డి వీధిలోని చర్చితో పాటు, చెమ్ముమియాపేటలో ఓ చర్చిలో అనిల్ కుమార్ బోధనలు చేశారు. చర్చికి వచ్చిన క్రైస్తవులను ఉత్తేజ పరిచే విధంగా, ఆలోచన రేకెత్తించే విధంగా అనిల్ ప్రసంగం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: