ఏపీ: ఉవ్వెత్తిన కదిలిన పల్లెలు.. ఆ పార్టీకే గుద్దేశారా?

Chakravarthi Kalyan
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ప్రజా స్పందన వచ్చింది. గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం కూడా పెరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీ రాజకీయాలు అంటేనే దేశ వ్యాప్తంగా ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దేశంలోనే ఎన్నికల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు చేసే నాయకులు ఏపీలో ఉన్నారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతారు అనే ప్రచారం కూడా ఉంది.

తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇది మరోసారి నిరూపితం అయింది. ఓటుకు కనిష్ఠం రూ.వెయ్యి చొప్పున పంచారంటేనే అర్థం చేసుకోవచ్చు.  కొన్ని చోట్ల ఓటుకి రూ.5వేలు ఇచ్చారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇక గొడవలు ఏ రేంజ్ లో జరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తంగా అయితే ఏపీలో పోలింగ్ భారీ ఎత్తున నమోదైందని నిన్నటి పోలింగ్ కేంద్రం వద్ద బారులు చూస్తేనే అర్థం అవుతుంది.

సహజంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటు చైతన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓటు వేయకపోతే తాముండి లేనట్టే అని గ్రామీణులు భావిస్తుంటారు. కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. ఇది పలు సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. సర్పంచి ఎన్నికల్లో మాదిరిగా ఉదయం నుంచే అది మాక్ పోలింగ్ జరుగుతుండగానే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

పది గంటలు, పన్నెండు, రెండు ఇలా గంటలు మారుతున్న కొద్దీ ఓటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ.. ఎక్కడా తగ్గలేదు. చాలా మంది నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది విప్లవాత్మక మార్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజామోదం ఉందని మనం భావించవచ్చు. రాష్ట్రంలోనే వాళ్లే కాకుండా దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అన్ని వర్గాల వారు ఈ ఓటింగ్ క్రతువులో పాల్గొన్నారు కాబట్టి వీరందరనీ దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం పాలన సాగించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: