ప్రస్తుత రోజుల్లో మహిళలు ఇంటా బయటా కష్టపడుతూ శారీరికంగా మానసికంగా అలసి పోతారు. ఇంట్లో పొద్దున లేచింది మొదలు వంట పని, పిల్లలను చూసుకోవడం ఇలా ఇంటి బాధ్యతలను పూర్తి చేసి మళ్ళీ బయట ఉద్యోగానికి పరుగులు తీయాలి. ఇలా రెండు చోట్ల ఎంతో కష్టపడుతున్నప్పటికి వారి బాధ్యతలను మాత్రం ఇష్టం గానే ప్రేమతో చేస్తారు. ఇలాంటి వారు నిద్ర పోయేది తక్కువే ఇలా అన్ని రకాలుగా వీరిలో తెలియకుండానే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. చాలా మంది మహిళలు వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకు పోతుంటారు. చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు.
కానీ తలనొప్పే కదా ఈజీగా తీసుకుంటే తర్వాత పరిణామాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. సమస్య ఏదైనా అది చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. అలా కాకుండా పట్టించుకోకుండా వదిలేస్తే కొన్ని తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. అలాగే మీకు ఎపుడో ఒక సారి తలనొప్పి వస్తే పర్వాలేదు. కానీ తరచూ వస్తుంది అంటే మాత్రం జాగ్రత్త పడి డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని రకాల తలనొప్పులు మైగ్రేన్ కి సంకేతాలు కావచ్చు లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన అయిండొచ్చు. కాబట్టి తలనొప్పే కదా అని అస్సలు అశ్రద్ద చేయరాదు. తరచూ వస్తుంది అంటే డాక్టర్ ను తప్పక సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలి.
కానీ చాలా మంది మహిళలు ఇప్పటికీ తమ ఆరోగ్యం విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వర్క్ కి ప్రాముఖ్యత ఇస్తుంటారు. పనిని గౌరవించాలి, ఇంటి సభ్యులకు తోడునీడగా ఉండి సహాయం చేయాలి. కాని వారు ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వయసు మీద పడుతున్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.